logo

ఉపాధి చూపుతామంటూ వ్యభిచార రొంపిలోకి

ఉపాధి అవకాశాల పేరుతో నమ్మించి పడుపు వృత్తిలోకి దించేందుకు తీసుకెళ్తున్న వ్యక్తి వద్ద నుంచి తప్పించుకుని రైల్వేస్టేషన్‌కు చేరుకున్న బాలికను సికింద్రాబాద్‌ ఆర్పీఎఫ్‌ పోలీసులు గుర్తించారు.

Published : 24 Nov 2022 01:51 IST

తప్పించుకొని వచ్చిన బాలిక తల్లిదండ్రులకు అప్పగింత

రెజిమెంటల్‌బజార్‌: ఉపాధి అవకాశాల పేరుతో నమ్మించి పడుపు వృత్తిలోకి దించేందుకు తీసుకెళ్తున్న వ్యక్తి వద్ద నుంచి తప్పించుకుని రైల్వేస్టేషన్‌కు చేరుకున్న బాలికను సికింద్రాబాద్‌ ఆర్పీఎఫ్‌ పోలీసులు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించినట్లు సికింద్రాబాద్‌ డివిజన్‌ ఆర్పీఎఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ దేబస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 31న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని 1వ ప్లాట్‌ఫాంపై ఆర్పీఎఫ్‌ ఎస్సై వెంకటరెడ్డి సిబ్బందితో కలిసి విధుల్లో ఉండగా ఆందోళనతో ఉన్న బాలిక(16)ను గుర్తించారు. స్టేషన్‌లోని ఛైల్డ్‌లైన్‌ దివ్యదిశ, బచ్‌పన్‌ బచావో ప్రతినిధులతో కలిసి బాలికను ప్రశ్నించారు. బిహార్‌లోని కిషన్‌గంజ్‌ జిల్లా నివాసినని, అదే ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి తనకు నెలకు రూ.6వేలిచ్చే ఉద్యోగం ఇప్పిస్తానంటూ తల్లిదండ్రులకు చెప్పి నమ్మించాడని వివరించింది. తనతోపాటు మరో నలుగురు యువతులకు మత్తుమందిచ్చి హరియాణాలోని పింజోర్‌కు తీసుకెళ్లినట్లు చెప్పింది. అక్కడికి వెళ్లిన తర్వాత వ్యభిచారం చేయాలని బలవంతపెట్టాడని, అక్కడి నుంచి తప్పించుకుని రైలెక్కి ఎలాగో ఇక్కడికి చేరుకున్నట్లు వివరించింది. ఆర్పీఎఫ్‌ సిబ్బంది పోలీసులు బిహర్‌ అధికారులను సంప్రదించి వివరాలు చెప్పడంతో అక్కడి పోలీసులు కేసు నమోదుచేసి మిగిలిన బాలికల ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 19న బాలికను తల్లికి అప్పగించినట్లు దేబస్మిత పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని