logo

బల్దియా ఆదరాబాదరా.. పోలీసులు ససేమిరా

పాదచారులకు భద్రత కల్పించేలా కూడళ్లను అభివృద్ధి చేయాలన్న ప్రాజెక్టుకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.

Published : 24 Nov 2022 01:51 IST

కూడళ్ల సుందరీకరణపై కుదరని సయోధ్య

సోమాజిగూడ కూడలిలో జరుగుతున్న పనులు

ఈనాడు, హైదరాబాద్‌: పాదచారులకు భద్రత కల్పించేలా కూడళ్లను అభివృద్ధి చేయాలన్న ప్రాజెక్టుకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. కూడళ్లలో సుందరీకరణ పనులను బల్దియా మొదలుపెట్టి వేగంగా చేస్తుంటే పోలీసులు ఆపేస్తున్నారు. పాదచారుల సౌలభ్యం కోసమని జీహెచ్‌ఎంసీ అంటుంటే వాహనాలకు ఇబ్బందులని ట్రాఫిక్‌ పోలీసులంటున్నారు. వీరి మధ్య సయోధ్య కుదరక నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కావట్లేదు.

పురోగతిలో పనులు..

మూడు రోడ్లు, నాలుగు రోడ్ల కూడళ్లలో పాదచారులు రోడ్డు దాటేందుకు అనుకూలంగా వసతులు కల్పించాలని, సేద తీరేందుకు సౌకర్యాలుండాలని జన అర్బన్‌ స్పేస్‌ సంస్థతో కలిసి జీహెచ్‌ఎంసీ ఇటీవల కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మొదటిదశలో జోన్‌కు 2 కూడళ్ల చొప్పున మొత్తం 12 కూడళ్లను ఎంపిక చేసింది. 6 జోన్లలోనూ పనులు ప్రారంభించింది. రూ.29.17 కోట్లతో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. ఖైరతాబాద్‌ జోన్లోని సోమాజిగూడ రాజీవ్‌ కూడలిలో 25 శాతం పనులు జరిగాయి. రాజీవ్‌గాంధీ విగ్రహం ఎదురుగా చేపట్టాల్సిన పనులకు ట్రాఫిక్‌ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే మూడుసార్లు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేసి జీహెచ్‌ఎంసీ పనులకు అనుమతివ్వలేమని తేల్చారు. జన అర్బన్‌ స్పేస్‌ ఏజెన్సీ రూపొందించిన తుది డిజైన్లలో పోలీసులు చెప్పినట్లు మార్పులు చేస్తే లక్ష్యం నెరవేరదని నిపుణుల వాదన. ఆరాంఘర్‌ చౌరస్తాలో తలపెట్టిన పనులకు, పంజాగుట్ట కూడలి పనులకు, ఇతరత్రా ప్రాంతాల్లోని కూడళ్ల అభివృద్ధి పనులకూ ఇదే సమస్య తలెత్తింది. కాలిబాటలను విశాలంగా నిర్మిస్తే రోడ్డు వెడల్పు తగ్గి ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుందని పోలీసులు వాదిస్తున్నారు. అలా జరగదని, నిబంధనల ప్రకారం రోడ్డు వెడల్పును అలాగే ఉంచుతామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. మొదటిదశ పూర్తయితే రెండోదశలో మరో 102 కూడళ్ల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ సిద్ధంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని