logo

పెద్దేముల్‌ ఆసుపత్రికి మహర్దశ

పెద్దేముల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ వచ్చింది. పురాతనమైన ఈ ఆసుపత్రి పురోగతికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రభుత్వం కొత్తగా భవన నిర్మాణానికి రూ.1.5 కోట్ల నిధులను మంజూరు చేసింది.

Published : 24 Nov 2022 01:50 IST

నూతన భవనానికి రూ.1.5 కోట్లు మంజూరు

న్యూస్‌టుడే, పెద్దేముల్‌: పెద్దేముల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ వచ్చింది. పురాతనమైన ఈ ఆసుపత్రి పురోగతికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రభుత్వం కొత్తగా భవన నిర్మాణానికి రూ.1.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే అధికారులు టెండర్ల, అగ్రిమెంట్‌ ప్రక్రియలను పూర్తి చేశారు. గుత్తేదారుకు పనులు అప్పగించారు. నెల రోజుల్లో మొదలుకానున్నాయని అధికారులు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలోనే ఉత్తమం: సుమారు ఇరవై ఏళ్ల క్రితమే పెద్దేముల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఓ వెలుగు వెలిగింది. ఉమ్మడి జిల్లాలోనే పలుమార్లు ఉత్తమ ఆసుపత్రిగా అవార్డులు పొందింది. అప్పట్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్‌, యాలాల, తాండూరు, పెద్దేముల్‌ మండలాల ప్రజలతో పాటు వికారాబాద్‌ పరిధిలోని బంట్వారం, కోట్‌పల్లి, ధారూరు, మోమిన్‌పేట మండలాల రోగులకు సేవలు అందాయి. ఒకే రోజు 150 మందికి పైగా కుని ఆపరేషన్లు చేసి రికార్డులను నమోదు చేసిన ఘన చరిత్ర ఈ ఆసుపత్రి సొంతం. వైద్యుల సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఆపరేషన్‌ థియేటర్‌ను నిర్మించారు.

1959లో ఆరు పడకలతో...: పెద్దేముల్‌లో 1959లో ఆరు పడకలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన మాలే గురువప్ప ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని ఆసుపత్రి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఓ వైపు ఆసుపత్రి, మరో వైపు ఆరోగ్య సిబ్బందికి నివాస గృహాలను నిర్మించారు. కర్నాటక సరిహద్దుల్లో ఉన్న గిరిజనులకు, పేద ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలు అందుతూ వచ్చాయి. అప్పట్లోనే రోజూ 100కు పైగా రోగులు వచ్చే వారు. ఇరవై నాలుగు గంటలూ సేవలు అందించేవారు. ప్రస్తుతం 12 గంటల సేవలు అందుతున్నాయి. రూ.1.5 కోట్ల నిధులు మంజూరు కావడం కొత్తగా భవన నిర్మాణం జరగడంపై ప్రజలకు మళ్లీ పూర్వ వైభవంపై ఆశలు చిగురిస్తున్నాయి.

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ: పాత భవనం శిథిలావస్థకు చేరుకుంది. గత్యంతరం లేక కూలిపోయే భవనంలోనే చికిత్సలు కొనసాగిస్తున్నారు. ఆసుపత్రి భవనం ఎప్పుడు కూలుతుందో చెప్పలేమని, రోగులు ఆందోళన చెందుతున్నారని కొత్తగా భవన నిర్మాణం చేపట్టాలని స్థానిక నాయకులు, ప్రజలు సమస్యను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ప్రత్యేక చొరవతో ఏకంగా రూ.1.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని స్థానికులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని