logo

చరిత ఆనవాళ్లు.. చెరిపేస్తున్నాయి తవ్వకాలు

మనదైన చరిత్రను భావితరాలకు అందించాలి. జిల్లాలో ఈ విషయంలో పురావస్తు శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

Published : 24 Nov 2022 01:50 IST

కనుమరుగవుతున్న సోమనాథ్‌గుట్ట
ఈనాడు, వికారాబాద్‌

మిగిలింది ఇలా..

నదైన చరిత్రను భావితరాలకు అందించాలి. జిల్లాలో ఈ విషయంలో పురావస్తు శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. క్రీస్తుశకం 5, 11వ శతాబ్దాల కాలంలో జీవించి ఉన్న వారికి సంబంధించిన చరిత్ర, ఆ విశేషాలు కళ్లముందే కనుమరుగవుతున్నాయి. మోమిన్‌పేట మండలం వెలిచాల్‌ శివారులో ఇటీవల బయటపడిన వీరగల్లు (వీరుడి) విగ్రహమే ఇందుకు సాక్ష్యం.  

ప్రాధాన్యం విస్మరించి.. అధికారికం అంటూ..

సోమనాథుని గుట్టపై అయిదేళ్లుగా ఇనుప ఖనిజం (ఐరన్‌ ఓర్‌) కోసం తవ్వకాలు సాగుతున్నాయి. ఇదంతా అధికారికమే. గుట్టకున్న ప్రాధాన్యం, చరిత్రను విస్మరించి అధికారులు అనుమతులిచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. గుట్టపై ఇటీవలే వీరగల్లు విగ్రహం దొరకడంతో తాత్కాలికంగా తవ్వకాలు నిలిపివేశారు. ‘న్యూస్‌టుడే’ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే మాత్రం ఇప్పటికే ఈ గుట్టు సగం తవ్వేశారు. మిగిలిన కొంత భాగాన్ని తవ్వుతుండగా... వీరగల్లును చెక్కిన విగ్రహం దొరికింది. దీనిపై ఒకవైపు దేవతా విగ్రహం, ఇద్దరు సేవకుల బొమ్మలు, రెండు వేటకుక్కల చిత్రాలున్నాయి.

పురాతన గుహ..

ఇది 10-11శతాబ్దాల మధ్యకాలంలోని చెక్కి ఉండొచ్చని పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు. ఆ ప్రాంతానికి రక్షించే వీరుడు చనిపోయిన తర్వాత అతడి జ్ఞాపకంగా అప్పట్లో ఇలా వీరగల్లులను రాళ్లపై చెక్కేవారు. ఇది దొరకడంతో తవ్వకం ఆగింది. లేకుంటే మిగిలిన కొంత మట్టి దిబ్బపై క్రీస్తుశకం 5వ శతాబ్దం లోపు తొలిచిన ఒక గుహ కూడా కాలగర్భంలో కలిసిపోయేదే. ఈ గుహను అప్పట్లో మానవులు ఆవాసంగా ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు.  

ప్రత్యేక దృష్టిసారిస్తే...!

గుట్టలను ఆనుకొని ఉన్న పులిలొంక పక్కనే ఉన్న గుట్టపై లక్ష్మీనరసింహ ఆలయం ఉంది. దీనిని సుమారు 60ఏళ్ల క్రితం పరమయ్య అనే వ్యక్తి స్వయంగా కొండను తొలిచి కట్టారు. ప్రస్తుతం దీనికి సమీపంలోనూ తవ్వకాలు సాగుతున్నాయి. ఈ ప్రాంతానికి ఉన్న చరిత్రను వెలికితీసేలా ప్రత్యేక దృష్టిసారించి పరిశోధనలు సాగించాలని స్థానికులు కోరుతున్నారు. ఈలోగా తవ్వకాలు నిలిపివేశేలా గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరమయ్య కష్టపడి లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మించకుంటే ఈ గుట్ట మొత్తం ఇప్పటికే తవ్వకాల్లో నేలమట్టం అయ్యే ఉండేదని ఆయన మనవడు వెంకటేశం వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని