logo

సంక్షిప్త వార్తలు(13)

పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

Published : 24 Nov 2022 01:50 IST

విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయించండి

ఈనాడు, హైదరాబాద్‌: పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటరు సవరణ-2023 కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించామని, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను డిసెంబరు 18 నాటికి సంబంధిత ఎన్నికల అధికారులకు తెలియజేయాలన్నారు. విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయించడంలో కళాశాలల యాజమాన్యాలు చొరవ తీసుకోవాలని కోరారు.


రూ.2.75 కోట్ల బీమా కేసు పరిష్కారం

ఈనాడు, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో ఒక్కగానొక్క కుమారుణ్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులను, బీమా కంపెనీ నష్టపరిహారం తిరస్కరించడం మరింత కుంగదీసింది. న్యాయసేవాధికార సంస్థ చూపిన ప్రత్యేక చొరవతో ఈ కేసు పరిష్కారమైంది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రాఘవ 2018 అక్టోబరులో తమిళనాడులోని సేలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లాడు. చికిత్స పొందుతూ 2019 మార్చిలో మరణించాడు. అతని చికిత్సలకు తల్లిదండ్రులు రూ.62 లక్షలు వెచ్చించినా ప్రాణం దక్కలేదు. రూ.4.5 కోట్ల బీమా పరిహారం చెల్లించాలంటూ హెచ్‌డీఎఫ్‌ ఎర్గో బీమా కంపెనీకి దరఖాస్తు చేయగా తిరస్కరించింది. ఈ కేసును న్యాయసేవాధికార సంస్థ రాజీ పద్ధతిలో పరిష్కరించేందుకు చొరవ చూపింది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ స్టేట్‌ హెడ్‌ నాగరాజు సమక్షంలో సిటీ సివిల్‌ కోర్టు జడ్జి రేణుక యారా రాఘవ తల్లిదండ్రులకు రూ.2.75 కోట్ల చెక్కును అందించారు. ఇంత పెద్ద మొత్తంలో కేసు పరిష్కారం కావడం ఇదే తొలిసారి అని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.మురళీమోహన్‌ తెలిపారు.


చిన్నారి హత్య కేసులో.. తల్లే నిందితురాలు?

ఉప్పల్‌, న్యూస్‌టుడే: రామంతాపూర్‌లో రెండు నెలల చిన్నారి హత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. తల్లే నీటి సంపులో పడేసి ఉంటుందనే అనుమానాలున్నాయి. పోలీసుల దర్యాప్తు కూడా అదే కోణంలో సాగుతున్నట్లు సమాచారం. గాంధీనగర్‌లో ఉండే మోహ్సిన్‌, సనాబేగం దంపతుల కుమారుడు 2 నెలల బాబు అబ్దుల్‌ రెహమాన్‌ ఈ నెల 19 అర్ధరాత్రి అనుమానాస్పదస్థితిలో నీటి సంపులో కనిపించిన విషయం తెలిసిందే. ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతి చెందాడు. పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులకు గతంలోనూ బాబు పుట్టి అనారోగ్యంతో చనిపోయాడు. ఈ బాబు సైతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తల్లే తీవ్రమైన ఒత్తిడి, మనోవేదనతో చిన్నారిని సంపులో పడేసి హత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


నిమ్స్‌లో డాక్టర్‌ ల్యాప్‌టాప్‌ మాయం

ఈనాడు, హైదరాబాద్‌: పంజాగుట్ట నిమ్స్‌ ఆసుపత్రిలో దొంగలు చేతివాటం చూపిస్తుండడంతో వైద్యులు, రోగులు ఆందోళన చెందుతున్నారు. రెండ్రోజుల క్రితం ఆర్థోపెడిక్‌ విభాగం ఓపీలో రెసిడెంట్‌ వైద్యురాలు రోగులను చూస్తున్న సమయంలో ల్యాప్‌టాప్‌ మాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో మొయినాబాద్‌ నుంచి ఓ అడ్డా కూలీకి పని ఇప్పిస్తానని తీసుకొచ్చి.. అతని చరవాణి తీసుకొని ఉడాయించారు. ఆసుపత్రి ఆవరణలో నిద్రిస్తున్న ఓ రోగి సహాయకుడి నుంచి కింది స్థాయి ఉద్యోగి ఒకరు ఇటీవల చరవాణిని తస్కరించాడు. ఇలాంటి  ఘటనలు జరుగుతున్నా వెలుగులోకి రావడంలేదు. కొన్నాళ్లుగా ఆసుపత్రిలో భద్రత వ్యవస్థ సక్రమంగా లేదని వైద్యులు ఆరోపిస్తున్నారు. రోగుల సహాయకులను ఒక్కరినే అనుమతించాల్సి ఉండగా నలుగురు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా ఓపీల్లో రద్దీ పెరుగుతోందంటున్నారు.


విద్యుదాఘాతంతో బాలిక మృతి

బాలానగర్‌, న్యూస్‌టుడే: నీరు వృథా అవుతున్నాయన్న తొందరపాటు.. ఓ బాలిక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బాలానగర్‌ సీఐ కె.భాస్కర్‌ కథనం ప్రకారం.. శోభనకాలనీకి చెందిన మహమ్మద్‌ ఖాజాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హుమెరాబేగం(17) బుధవారం ఇల్లు కడిగేందుకు బోరు వేసి పైపుతో శుభ్రం చేసింది. పని పూర్తయ్యాక నీరు పైపు నుంచి వృథాగా పోతోందనే తొందరపాటుతో వెళ్లి తడి చేతులతో బోరు స్విచ్‌ ఆఫ్‌ చేయబోయింది. షాక్‌ తగిలి కిండపడిన బాలికను గమనించిన తల్లి హలీమాబేగం వెంటనే స్థానికుల సహకారంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. వైద్యులు పరీక్షించి అప్పటికే బాలిక మృతిచెందినట్లు ధ్రువీకరించారు.


నిరుద్యోగ దివ్యాంగులకు ఉపాధి శిక్షణ

అంబర్‌పేట, న్యూస్‌టుడే: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ దివ్యాంగులకు నెల రోజులపాటు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాజెక్ట్‌ మేనేజర్‌ మధు తెలిపారు. బుధవారం అంబర్‌పేటలో ఆయన మాట్లాడారు. ఎస్సెస్సీ ఉత్తీర్ణులై 18-30 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంగ్లిష్‌ టైపింగ్‌, ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ కోర్సు(ఐటీసీ)లో శిక్షణతోపాటు వసతి సదుపాయం కల్పిస్తామని వివరించారు. ఈ నెల 30లోపు ఫోన్‌ నంబర్లు: 80748 19404, 80088 61623 ద్వారా పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు.


పోలీసుల అదుపులో మల్టీజెట్‌ కేసు నిందితులు?

ఈనాడు, హైదరాబాద్‌: హబ్సిగూడ కేంద్రంగా ‘మల్జీజెట్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో పలువురిని మోసగించిన కేసులో ఇద్దరు కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. సంస్థ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగర సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోజూ 10 మంది బాధితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.


కొట్టేసిన సొమ్ముతో 2 కిలోల బంగారం కొనుగోలు

ఈనాడు, హైదరాబాద్‌: పాత పుస్తకాలు, నవలల డిజిటలీకరణ పేరిట విసిరిన వలలో చిక్కి మోసపోయిన బాధితులు నగర సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ కేసులో నిందితులైన సయ్యద్‌ సమీరుద్దీన్‌, ఆశిష్‌కుమార్‌, అమిత్‌ శర్మలను గతంలో, ప్రధాన సూత్రధారి దిల్లీకి చెందిన దీపక్‌శర్మ(27)ను తాజాగా అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.  620 మంది నుంచి రూ.15 కోట్లు వసూలు చేసిన ఈ నలుగురు నిందితులు.. రూ.10 కోట్ల మేర బాధితులకు కమీషన్‌ రూపంలో చెల్లించారు. మిగిలిన రూ.5 కోట్లు ఎక్కడ దాచారనేది తేలాల్సి ఉంది. కాజేసిన సొమ్ముతో 2 కిలోల బంగారం కొని, పంచుకున్నట్లు నిందితులు పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్లు తెలుస్తోంది.  మరిన్ని వివరాలు రాబట్టేందుకు దీపక్‌శర్మను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వారు కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు.


ఉన్నత విద్య ఉపకార వేతనాలకు హైసెట్‌ పరీక్ష

బేగంపేట, న్యూస్‌టుడే: పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం ఘియాసుద్దీన్‌ బాబుఖాన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఉపకార వేతనాలను అందజేసేందుకు హైసెట్‌ (హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ స్కాలర్‌షిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) నిర్వహించనున్నారు. బేగంపేటలోని జఖత్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో బుధవారం  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, సంస్థ డైరెక్టర్లు జావెద్‌ హుద్‌, ఖలీల్‌ అహ్మద్‌, అలీ హైదర్‌ తదితరులు హైసెట్‌ కరపత్రాలను ఆవిష్కరించారు. తెలంగాణ, ఏపీల్లో 2023 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఆన్‌లైన్‌లో హైసెట్‌ పరీక్ష నిర్వహిస్తామన్నారు. డిసెంబరు 1 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, మరిన్ని వివరాలకు 98665 56857, 99492 11119 లేదా http://hieset.in లో సంప్రదించాలన్నారు.


ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌

గోల్నాక, న్యూస్‌టుడే: కేంద్రంలోని శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రాలవారీగా ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. బుధవారం చాదర్‌ఘాట్‌ మోతీమార్కెట్‌లోని కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో గ్రూపు-3, 4, ఉపాధ్యాయ, క్లరికల్‌ పోస్టులు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. నేతలు సాంబశివగౌడ్‌, పేరం నాగేశ్వర్‌రావు, మాణిక్‌రావు, ప్రశాంత్‌ నిమ్‌కర్‌, శ్రీకాంత్‌వాసు పాల్గొన్నారు.


గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: శివసేన

కాచిగూడ, న్యూస్‌టుడే: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి సంరక్షించాలని శివసేన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి ఎ.సుదర్శన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్‌లో గోసంరక్షణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం కాచిగూడలో శివసేన ఆధ్వర్యంలో గోసేవ కార్యక్రమాన్ని యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్‌తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. గోవధ నిషేధ చట్టం ఉన్నా పక్కాగా అమలు కావడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఆవులను మాంసం కోసం వధిస్తుండటంతో వాటి సంతతి క్రమేణా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నేతలు రామారావు, రాజేశ్‌, శ్రీనివాస్‌, విశ్వాస్‌రావు పాటిల్‌, యాదగిరి, నాగరాజు పాల్గొన్నారు.


‘పల్లెవెలుగు’లోనూ పనిచేయనున్న గ్రేటర్‌ బస్‌పాస్‌  

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ బస్‌పాస్‌ కలిగి ఉన్న విద్యార్థులను పల్లెవెలుగు బస్సులతోపాటు ఎక్స్‌ప్రెస్‌లుగా నడిచే పల్లె వెలుగు బస్సుల్లోనూ అనుమతించనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ బుధవారం వెల్లడించారు.


ఆర్టీసీతో అయ్యప్ప దర్శనం

ఈనాడు, హైదరాబాద్‌: అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లాలనుకుంటున్నారా? మీలాంటి వారి కోసం ఆర్టీసీ ప్యాకేజీలు ప్రకటించింది. 36 మంది గల స్వాములకు ఒక బస్సు చొప్పున అద్దెకు ఇస్తున్నట్టు ప్రకటించింది. అనుభవజ్ఞులైన బస్సు డ్రైవర్లు ఇద్దరిని ఒక్కో బస్సుకు కేటాయిస్తున్నట్టు తెలిపింది.
ఉచితం ఎవరికంటే..  ఒక గురు స్వామి, ఇద్దరు వంట మనుషులు, ఇద్దరు మణికంఠలు(10 ఏళ్లలోపు చిన్నారులు), ఒక అటెండర్‌  షరతులు.. బస్సులు బుక్‌ చేసిన గురు స్వాములకు, ఏటీబీ ఏజెంట్లకు రోజుకు రూ.300ల చొప్పున కమీషన్‌ ఇస్తున్నట్లు పేర్కొంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దుల్లో పన్నులను బస్సు బుక్‌ చేసుకున్నవారే చెల్లించాలి. అలాగే టోల్‌గేటు, పర్మిట్‌ ట్యాక్సులు కూడా బుక్‌ చేసిన వారే చెల్లించాలి. అన్ని బస్సులకు వేచిఉండే ఛార్జి గంటకు రూ.300 చొప్పున ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని