logo

నేర వార్తలు

నవ మాసాలు మోసిన తల్లే.. రెండు నెలల చిన్నారి ప్రాణం తీసింది. బాలుడి అనారోగ్యమే ఆ మాతృమూర్తిని హంతకురాలిని చేసింది. గురువారం పోలీసులు ఆమెను రిమాండ్‌కు తరలించారు.

Published : 25 Nov 2022 02:46 IST

కొడుకు హత్య కేసులో.. తల్లి కటకటాలపాలు

ఉప్పల్‌, న్యూస్‌టుడే: నవ మాసాలు మోసిన తల్లే.. రెండు నెలల చిన్నారి ప్రాణం తీసింది. బాలుడి అనారోగ్యమే ఆ మాతృమూర్తిని హంతకురాలిని చేసింది. గురువారం పోలీసులు ఆమెను రిమాండ్‌కు తరలించారు. ఉప్పల్‌ పరిధిలోని రామంతాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్‌లో ఉండే మోహ్సిన్‌, సనాబేగం దంపతులకు రెండు నెలల కుమారుడు అబ్దుల్‌ రెహమాన్‌ ఉన్నాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారు. ఈ పరిస్థితి చూడలేని సనాబేగం ఈ నెల 19 అర్ధరాత్రి చిన్నారిని నీటి సంపులో పడేసింది. కనిపించడంలేదంటూ కుటుంబ సభ్యులకు చెప్పింది. సంపులో గుర్తించి బాలుడిని ఆస్పత్రికి తరలించగా 20న చికిత్స పొందుతూ మృతి చెందాడు.


ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గౌతంనగర్‌, న్యూస్‌టుడే: ప్రేమలో విఫలమై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మల్కాజిగిరి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలి పరిధిలోని ఎంజే కాలనీలో నివసించే జహంగీర్‌(20) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. స్థానికంగా ఓ యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. మనస్పర్థల కారణంగా ఇటీవల విడిపోయారు. అప్పటి నుంచి మనస్తాపంతో పనికి వెళ్లకుండా ఒంటరిగా ఉంటున్నాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


తండ్రి వెళ్లిపోయాడని కుమార్తె బలవన్మరణం

గౌతంనగర్‌, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో తండ్రి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. మల్కాజిగిరి పోలీసుల వివరాల ప్రకారం.. మౌలాలి డివిజన్‌ ఆర్టీసీ కాలనీలో నివసించే దంపతులకు ఒక కుమార్తె(19), కుమారుడు ఉన్నారు. కుమార్తె ఈసీఐఎల్‌లో డిగ్రీ చదువుతోంది. భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 20 రోజుల కిందట భర్త ఇంట్లోంచి వెళ్లిపోయి వేరుగా ఉంటున్నాడు. తండ్రి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన కూతురు గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


తమ్మీ.. అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకో!

పురుగు మందు తాగి  తనువు చాలించిన యువకుడు

మేడ్చల్‌, న్యూస్‌టుడే: పెళ్లి కావడం లేదని.. కుటుంబీకులతో గొడవపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేడ్చల్‌ పోలీసుల వివరాల ప్రకారం.. ప్రశాంత్‌నగర్‌ విజ్ఞానపురి కాలనీలో నివసించే ఎం.తిరుమల్‌రెడ్డి(28) కూకట్‌పల్లి ఆర్టీఓ కార్యాలయంలో పనిచేసేవారు.  గురువారం మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం 6 గంటలకు తమ్ముడు రవితేజకు ఫోన్‌ చేశాడు. మేడ్చల్‌ పరిధి బాసరేగడి ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. తల్లిదండ్రులకు లోటు లేకుండా చూసుకోవాలని తెలిపాడు. రవితేజ, ఆయన బావ హేమంత్‌రెడ్డి అక్కడికి వెళ్లి, అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


గోవులను అపహరించిన ఐదుగురు పాత నేరస్థుల అరెస్టు

నాచారం, న్యూస్‌టుడే: గోవులను అపహరించిన ఐదుగురు పాత నేరస్థులను నాచారం పోలీసులు అరెస్టు చేశారు. ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి ఏసీపీ నరేష్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. బహదూర్‌పురకు చెందిన మహమ్మద్‌ అయూబ్‌(60) ఆటోడ్రైవర్‌. మూడు కమిషనరేట్ల పరిధిలో అతనిపై 130 కేసులు, 30 నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు ఉన్నాయి. అదే ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ బాబా(40) ఆటో డ్రైవర్‌. చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్‌ అయూబ్‌ ఖురేషి(34), మహమ్మద్‌ రఫీక్‌(50), మహమ్మద్‌ సద్దాం ఖురేషి(33)పై 40 వరకు కేసులున్నాయి. వీరంతా ఆవులను అపహరించేందుకు ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 15న నాచారం వీరారెడ్డి కాలనీలోని ఎం.వెంకటరెడ్డికి చెందిన అయిదు ఆవులను అపహరించారు. బంజారాహిల్స్‌ పరిధిలోని ఇమ్రాన్‌నగర్‌ వద్ద వధశాలలో వధించి.. మాంసాన్ని విక్రయించారు. దుకాణదారులకు అనుమానం కలగకుండా జియాగూడ మాంసపు మార్కెట్‌ నుంచి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16న బాధితుడు నాచారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు 80 నిఘానేత్రాలను పరిశీలించి వాహనం వెళ్లిన ప్రదేశం ఇమ్రాన్‌నగర్‌గా గుర్తించారు. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. నిందితులు బాలాపూర్‌ షరీఫ్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఉన్నట్లు గుర్తించి, గురువారం ఉదయం అరెస్టు చేశారు. ఠాణాకు తరలించి విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి రూ.2.50 లక్షలు, వాహనం, చరవాణులు, తూకం యంత్రం, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ, డీఎస్సై, కానిస్టేబుళ్లు ప్రసన్న, రోహిత్‌లను ఏసీపీ అభినందించారు.


సైబర్‌ అధ్యాపకురాలికే టోకరా

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధ్యాపకురాలినే కేటుగాళ్లు మోసం చేశారు. మెహిదీపట్నంలోని ప్రముఖ మహిళా కళాశాలలో నల్లకుంటకు చెందిన అధ్యాపకురాలు బోధిస్తున్నారు. సమాజంలో నిత్యం చోటుచేసుకుంటున్న నేరాలు, మోసాలు తదితర అంశాలపై విద్యార్థులను ఆమె అప్రమత్తం చేస్తుంటారు. ఇటీవల ఆమెకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌చేసి.. మీ ఇంటి కరెంటు బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు. ఆన్‌లైన్‌లో కొంత నగదు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని, వివరాలు నిర్ధారించాక మిగతాది పంపించాలని నమ్మబలికారు. బిల్లు పెండింగ్‌లో ఉండటంతో.. ఆ మాటలు నమ్మి ఆమె తొలుత కొంత నగదును ట్రాన్స్‌ఫర్‌ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష మాయమైంది. మోసపోయినట్లు గ్రహించిన అధ్యాపకురాలు సైబర్‌ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు.


విమానాశ్రయంలో 1,821 గ్రాముల బంగారం పట్టివేత

శంషాబాద్‌, న్యూస్‌టుడే: దుబాయ్‌ నుంచి తరలిస్తున్న రూ.కోటి విలువైన అక్రమ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయ అధికారుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఒమర్‌ దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ విమానంలో ఇక్కడికి వచ్చారు. 1,821 గ్రాముల బంగారాన్ని ముద్ద చేసి తన సామగ్రిలో రహస్యంగా తీసుకొచ్చారు. ఒమర్‌ ప్రవర్తనపై అధికారులకు అనుమానం రావడంతో సామగ్రిని తనిఖీ చేయగా అక్రమ బంగారం తరలింపు గుట్టురట్టయింది. అతడిని అరెస్టు చేశారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని