logo

రహదారి.. వదల బొమ్మాళి

ఏదైనా రహదారి విస్తరణకు నోచుకోగానే.. రోడ్డుకు ఇరువైపులా ఉండే ప్రభుత్వ స్థలాన్ని, మూలలను, కాలిబాటలను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు కొందరు యుద్ధం ప్రకటిస్తున్నారు.

Published : 25 Nov 2022 03:10 IST

కోట్ల రూపాయలతో రోడ్లను విస్తరిస్తున్న జీహెచ్‌ఎంసీ
నెలల వ్యవధిలోనే ఇరువైపులా దురాక్రమణలు


కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద కాలిబాటపై ఇలా..

ఈనాడు, హైదరాబాద్‌: ఏదైనా రహదారి విస్తరణకు నోచుకోగానే.. రోడ్డుకు ఇరువైపులా ఉండే ప్రభుత్వ స్థలాన్ని, మూలలను, కాలిబాటలను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు కొందరు యుద్ధం ప్రకటిస్తున్నారు. రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తున్న రోడ్లను.. నెలలు తిరక్కముందే మింగేస్తున్నారు. ఇవన్నీ నియోజకవర్గాలు, డివిజన్ల ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. విశాలమైన రహదారులు, చింత లేని ప్రయాణం, ఆక్రమణల్లేని రోడ్డు మార్గాలతోనే విశ్వనగరం సాకారమవుతుందన్నది స్థానిక నేతలు పూర్తిగా విస్మరిస్తున్నారు. రహదారుల ఆక్రమణలపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలన కథనం.

ఇవిగో ఆక్రమణలు..

* మూసాపేట ప్రధాన రహదారి నుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయం మీదుగా ఆంజనేయనగర్‌ వరకు 80 అడుగుల వెడల్పుతో రహదారిని విస్తరించే పనులు 12ఏళ్ల కిందట మొదలవగా.. ఇప్పటికీ పూర్తవలేదు. కోర్టు కేసులున్నాయంటూ అధికారులు ఓ వైపు కాలయాపన చేస్తుండగా.. మరోవైపు నిర్మాణాలను తొలగించిన ప్రాంతాల్లోనూ పూర్తిస్థాయిలో నిర్మించట్లేదు. ఫలితంగా.. జీహెచ్‌ఎంసీ ఆఫీసు చుట్టుపక్కల ఉన్న రోడ్లు, కాలిబాటలు సైతం ఆక్రమణకు గురయ్యాయి. రహదారులు పార్కింగ్‌ స్థలాలుగా మారాయి.

* మూసాపేట రెయిన్‌బో విస్టా నుంచి కైత్లాపూర్‌ వెళ్లే దారిని జీహెచ్‌ఎంసీ నాలుగేళ్ల క్రితం 100అడుగుల మేర విస్తరించింది. కైత్లాపూర్‌లో ఆర్‌ఓబీ, హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌ ఆర్‌ఓబీ, ఆర్‌యూబీలు అందుబాటులోకి రావడంతో కైత్లాపూర్‌ రహదారిపై రాకపోకలు భారీగా పెరిగాయి. రెయిన్‌బో విస్టా పక్కనున్న కొందరు బస్తీ నాయకులు రహదారిని ఆక్రమించారు. ఆలయం వెనుకవైపుండే పాఠశాల స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్సు నిర్మించారు.

* కైత్లాపూర్‌ ఆర్‌ఓబీ నుంచి పర్వత్‌నగర్‌ మీదుగా అయ్యప్పసొసైటీ, కావూరిహిల్స్‌ మార్గం విస్తరణకు నోచుకోలేదు. భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలను అధికారులు తొలగించలేదు. ఆయా మార్గాలపై కొత్త దుకాణాలు ఏర్పాటవుతున్నాయి.

* అయ్యప్పసొసైటీని బోరబండతో కలుపుతూ రూ.కోట్ల ఖర్చుతో 100అడుగుల లింకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. అంతలోనే రోడ్డు పక్కన, సున్నం చెరువులో నిర్మాణాలు మొదలయ్యాయి.

* కేపీహెచ్‌బీకాలనీల్లో రోడ్లన్నీ ఆక్రమణకు గురయ్యాయి. కొత్తగా నిర్మాణమైన రోడ్లలోనూ మరిన్ని దుకాణాలు నిర్మాణమవడం ఆందోళనకు తావిస్తోంది.


నేతల అండదండలతో..

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి పేరుతో మూసాపేట, కైత్లాపూర్‌లో భూ ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు మౌనం వహిస్తున్నారు. ఐడీఎల్‌ రోడ్డుకు ఇరువైపులా ఎకరాల కొద్దీ ప్రభుత్వ, ఉదాసీన్‌ మఠం భూముల్లో అక్రమంగా వెలుస్తున్న నిర్మాణాలే అందుకు నిదర్శనం. సుమారు రూ.100కోట్ల విలువైన భూములు ఆక్రమణలో చిక్కుకున్నాయి. హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌ నుంచి హఫీజ్‌పేట మార్గంలో గోపాల్‌నగర్‌ సొసైటీ వద్ద ఆక్రమణలు నానాటికీ పెరుగుతున్నాయి. రహదారుల విస్తరణతో వ్యాపారులు మరింతగా ఆక్రమించేస్తున్నారు. ఖాజాగూడ ప్రధాన రహదారిపై జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు వద్ద గతేడాది ఎకరం స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమిస్తుండగా.. అధికారులు వెంటనే తొలగించారు. అదే మాదిరి.. అన్ని ప్రాంతాల్లో ఆక్రమణలను ఆదిలోనే అడ్డుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని