logo

నిర్మాణం మొదలెడుతున్నారా..గద్దలొచ్చేస్తాయ్‌!

 కొత్తగా ఎవరైనా భవన నిర్మాణం చేపడితే చాలు.. వెంటనే వచ్చేస్తారు. అనుమతిఉంటే ఒక రేటు.. లేకపోతే మరో రేటు.. అంతస్తుల సంఖ్యబట్టి వసూలు మొత్తం మారుతుంది.

Published : 25 Nov 2022 03:14 IST

శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అక్రమ దందా

ఈనాడు, హైదరాబాద్‌: కొత్తగా ఎవరైనా భవన నిర్మాణం చేపడితే చాలు.. వెంటనే వచ్చేస్తారు. అనుమతిఉంటే ఒక రేటు.. లేకపోతే మరో రేటు.. అంతస్తుల సంఖ్యబట్టి వసూలు మొత్తం మారుతుంది. నగర శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొందరు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నిర్మాణదారులను జలగల్లా పీడిస్తున్నారు. వీరితీరుతో యజమానులు  హడలెత్తిపోతున్నారు. తాజాగా మణికొండలో ఓ నిర్మాణదారును  డబ్బులు డిమాండ్‌ చేసిన ఘటనలో కౌన్సిలర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల  వసూళ్ల దందాపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

లెక్కగట్టి రేట్లు.. అపార్టుమెంట్లు.. వ్యక్తిగత ఇళ్లు.. వాణిజ్య భవనాలు.. ఇలా కేటగిరీలుగా విభజించి వసూళ్లకు తెగబడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని 22 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలో పెద్ద సంఖ్యలో కాలనీలు ఏర్పాటవుతుండటంతో... నిర్మాణాలూ అదేతీరున  జరుగుతున్నాయి. ఇవి స్థానిక ప్రజాప్రతినిధులకు కామధేనువులుగా మారాయి. అనుమతుల్లో పారదర్శకత కోసం టీఎస్‌బీపాస్‌ తీసుకొచ్చినా.. ఈ వ్యవహారాలకు తెరపడలేదు. పనులు చేపట్టడానికంటే ముందుగానే అడిగినంత ఇవ్వాలి. లేకపోతే  అధికారులను పంపించి అడ్డుకోవడం చేస్తున్నారు. మేడ్చల్‌, కొత్తూరు, శంషాబాద్‌లో కొందరు బోర్లు వేసినా మామూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

అధికారులు, సిబ్బంది సహకారం

ఇంటి యజమాని దరఖాస్తు చేసుకోగానే.. ఆ వివరాలను నేరుగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బందే చేరవేస్తున్నారు. పీర్జాదిగూడలో వార్డు అధికారుల పేరిట కొందర్ని కార్పొరేషన్‌ నియమించింది. సమస్యలుంటే కార్పొరేషన్‌కు చెప్పడం వీరి విధి కాగా, కార్పొరేటర్లకు ఆదాయం సమకూర్చిపెట్టడమే పనిగా మార్చుకున్నారు. నిర్మాణం మొదలైతే తనిఖీల పేరిట బెదిరింపులకు పాల్పడి వసూళ్లు చేస్తున్నారు.


ఒక్కొక్కచోట.. ఒక్కోలా..

* మణికొండ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతుంటాయి. అధికారుల తీరుతో ఇప్పటికే పార్కులు పెద్దఎత్తున కబ్జాకు గురయ్యాయి. కొందరు కౌన్సిలర్లు వత్తాసు పలుకుతూ ఒక్కో నిర్మాణం నుంచి రూ.2-4లక్షల వరకు వసూలు చేస్తున్నారు.

* నార్సింగి మున్సిపాలిటీలోనూ ఓ కౌన్సిలర్‌ పదవిలోకి వచ్చినప్పట్నుంచి ఈ సంపాదనే ప్రధాన పని.

* టీఎస్‌-బీపాస్‌ విధానాన్ని పీర్జాదిగూడలో బేఖాతరు చేస్తున్న పరిస్థితి. నిర్మాణదారులు ముందుగా కార్పొరేటర్ల నుంచి నిరభ్యంతరపత్రం తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏకంగా అపార్టుమెంట్‌కు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు తీసుకుంటున్నారు.

* బోడుప్పల్‌లో తన డివిజన్‌లో ఏ నిర్మాణం జరిగినా రూ.30-40వేలు ఇవ్వాలన్నది ఓ కార్పొరేటర్‌ షరతు.

* బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌లో ఓ పార్టీ కార్పొరేటర్లు మొదట్లో కలిసి వసూళ్లు చేశారు. పంపకాల్లో తేడాలతో ప్రస్తుతం ఎవరికి వారే వసూళ్లకు పాల్పడుతున్నారు. అపార్టుమెంట్లు ఎక్కువగా కడుతున్న ఓ వార్డులో రూ.2లక్షల వరకు చెల్లించుకోవాల్సి వస్తోంది.

* తుర్కయాంజల్‌లో కొందరు కౌన్సిలర్ల తీరే వేరు.నిర్మాణ దరఖాస్తులేవైనా వారికి ఇవ్వాల్సిందే. అనుమతులు వారి ద్వారానే పొందాలి. ఇందుకు రూ.40-50వేలు సమర్పించుకోవాలి. లేదంటే బెదిరింపులే.

* జవహర్‌నగర్‌లో ఇంటి నిర్మాణాలకు అనుమతి లేదు. కార్పొరేటర్లే రూ.లక్షనుంచి రూ.2లక్షలు తీసుకుని ప్రోత్సహిస్తున్నారు.

* శంషాబాద్‌లోని ఓ కీలక ప్రజాప్రతినిధి అన్ని అనుమతులు తీసుకువస్తానంటూ నాలుగు భారీ నిర్మాణాల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసినట్లు సమాచారం.

* నిజాంపేట కార్పొరేషన్‌లో ఓ ప్రజాప్రతినిధి తానే వసూలు చేసి.. మిగిలిన సహచరులకు పంచుతున్నారు.

* పోచారం మున్సిపాలిటీలో రెండు ముఠాలుగా విడిపోయి దందా నడిపిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts