logo

మల్టీజెట్‌ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

హబ్సిగూడ కేంద్రంగా మల్టీజెట్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు టేకుల ముక్తిరాజ్‌(62), భాస్కర్‌(36)లను శనివారం అరెస్ట్‌ చేసినట్టు నగర సీసీఎస్‌ జాయింట్‌ సీపీ డాక్టర్‌ గజరావు భూపాల్‌ తెలిపారు.

Published : 27 Nov 2022 03:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: హబ్సిగూడ కేంద్రంగా మల్టీజెట్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు టేకుల ముక్తిరాజ్‌(62), భాస్కర్‌(36)లను శనివారం అరెస్ట్‌ చేసినట్టు నగర సీసీఎస్‌ జాయింట్‌ సీపీ డాక్టర్‌ గజరావు భూపాల్‌ తెలిపారు. ముషీరాబాద్‌కు చెందిన ముక్తిరాజ్‌ ఈ ఏడాది జులైలో హబ్సిగూడలో రియల్‌లైఫ్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ పేరుతో సంస్థను ప్రారంభించాడు. ఆగస్టులో మల్టీజెట్‌ ట్రేడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థగా మార్చారు. మహారాష్ట్ర చంద్రపూర్‌ ప్రాంతానికి చెందిన మోతిలాల్‌ సర్కార్‌, ప్రశాంత్‌ ఏక్‌నాథ్‌ బురండేలను డైరెక్టర్లుగా నియమించాడు. భాస్కర్‌ అనే మరో ఉద్యోగిని నియమించుకున్నాడు. మల్టీజెట్‌ కమోడిటీ ట్రేడింగ్‌లో డబ్బు పెట్టుబడితో రోజువారీ 2-3 శాతం రాబడి అందిస్తామంటూ ఆశచూపారు. తాము రూపొందించిన వెబ్‌సైట్‌ ద్వారా ప్రతి పెట్టుబడిదారుడికి ఐడీ కేటాయించారు. వచ్చే ఆదాయం ఎప్పటికప్పుడు చూసుకునేలా వీలు కల్పించారు. వెబ్‌సైట్‌లోని 11 వస్తువులపై పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనేది నిబంధన. వస్తువులను కొనుగోలు చేస్తూ ఆ వచ్చే లాభం రోజూ ఐడీలో లాగిన్‌ అయి చూడొచ్చు. ముంబయిలోని ముస్తాక్‌ ద్వారా ఆయా వస్తువుల మార్కెటింగ్‌ ట్రెండ్‌ను సేకరించి వెబ్‌సైట్‌లో ఉంచి సభ్యులను నమ్మించి భారీగా పెట్టుబడులు సేకరించారు. కోట్లాది రూపాయలు చేతికి అందడంతో ఈ నెల 10న కార్యాలయం మూసివేసి ముక్తిరాజ్‌, భాస్కర్‌, మరో ఇద్దరు ఉద్యోగులు పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీసీఎస్‌ ఏసీపీ కె.నర్సింగ్‌రావు, దేవసురేష్‌, కరుణాకర్‌రెడ్డి బృందం శనివారం మధ్యాహ్నం ముక్తిరాజ్‌, భాస్కర్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని