logo

రూ.100 కోట్ల భూమి స్వాహా

హైటెక్‌సిటీకి ఆనుకుని ఉన్న రూ.100కోట్ల భూమిని ఆక్రమణదారులు మింగేశారు. ప్రభుత్వ భూమినేగాక.. చెరువును, నాలాను, నిషేధిత భూములను.. వేటినీ వదలట్లేదు.  ఇళ్లు నిర్మించి గజం రూ.50వేల చొప్పున ధర నిర్ణయించి అమ్మేస్తున్నారు.  

Updated : 27 Nov 2022 04:41 IST

కూకట్‌పల్లి పరిధిలోని మఠం, చెరువు, నిషేధిత స్థలాల్లో నిర్మాణాలు

రాఘవేంద్రసొసైటీ కాలనీ ప్రాంతంలో వెలసిన నిర్మాణాలు

ఈనాడు, హైదరాబాద్‌: హైటెక్‌సిటీకి ఆనుకుని ఉన్న రూ.100కోట్ల భూమిని ఆక్రమణదారులు మింగేశారు. ప్రభుత్వ భూమినేగాక.. చెరువును, నాలాను, నిషేధిత భూములను.. వేటినీ వదలట్లేదు.  ఇళ్లు నిర్మించి గజం రూ.50వేల చొప్పున ధర నిర్ణయించి అమ్మేస్తున్నారు.  కైత్లాపూర్‌, కూకట్‌పల్లిలో సాగుతోన్న ఆక్రమణల బాగోతమిది. నియోజకవర్గం ముఖ్యనేత అండదండలతో, స్థానిక డివిజన్‌ నేత మద్దతుతో ఆక్రమణలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. అడ్డుకునేందుకు యత్నించే అధికారులపై బస్తీ నేతలు దాడులు చేస్తుండటం ఆందోళనకు తావిస్తోంది. అధికారులను చంపుతామనే వరకు కబ్జాదారులు బరితెగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విద్యుత్తు, నల్లా కనెక్షన్లు..

మూసాపేట నుంచి కైత్లాపూర్‌ వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని.. ఉదాసీన్‌ మఠం భూములు, కాముని చెరువు శిఖం, చెరువు బఫర్‌, ఎఫ్‌టీఎల్‌ భూములుంటాయి. ఇదంతా.. రెయిన్‌బో విస్టా నుంచి కైత్లాపూర్‌ వెళ్లేటప్పుడు ఎడమవైపున ఎదురయ్యే శ్మశానవాటిక లోపలివైపు ఉండే భూమి గురించి. కొన్నేళ్లుగా అక్కడ పేదలు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. కాలనీని రాఘవేంద్ర సొసైటీ అని పిలుస్తారు. కొంత కాలంగా బస్తీ నేతలు బరితెగించారు. చెరువు ఒడ్డున ఉండే కాలనీని శ్మశానవాటిక వరకు విస్తరిస్తున్నారు. అందులో భాగంగా రెయిన్‌బో విస్టా పక్కనున్న గుట్టను చదును చేసి సుమారు 20 ఇళ్లు నిర్మించారు.  విద్యుత్తు కనెక్షన్లు, నల్లా కనెక్షన్లు మంజూరయ్యాయి. రోడ్లు కూడా వేయిస్తామని బేరసారాలు జరుపుతున్నారు.  

కైత్లాపూర్‌ గ్రామానికి పక్కనే.. కూకట్‌పల్లి గ్రామ పరిధిలో ప్రభుత్వం కోర్టు కాంప్లెక్సు నిర్మిస్తోంది. భవన సముదాయానికి సమీపంలో, ముళ్లకత్వ చెరువు కట్టకు ఆనుకుని, అంబేడ్కర్‌నగర్‌ పక్కన సుమారు రెండెకరాల భూమిలో అనుమతి లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయి. తాజాగా భారత్‌పెట్రోలు బంకు వెనుకవైపు మైసమ్మచెరువులో మూడెకరాల ఎఫ్‌టీఎల్‌ స్థలాన్ని మట్టితో పూడ్చడం గమనార్హం. వాటిపై వివరణ కోరగా.. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించేందుకు నిరాకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు