logo

బాధ్యత మహిళలకేనా..!

‘చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం’ అంటూ వైద్య శాఖ కుటుంబ నియంత్రణ  (కు.ని.)కు ప్రచారం చేస్తోంది

Published : 27 Nov 2022 03:34 IST

కు.ని. చికిత్సలకు చొరవ చూపని పురుషులు
న్యూస్‌టుడే, వికారాబాద్‌  మున్సిపాలిటీ, పరిగి, పెద్దేముల్‌

పెద్దేముల్‌లో ర్యాలీ

‘చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం’ అంటూ వైద్య శాఖ కుటుంబ నియంత్రణ  (కు.ని.)కు ప్రచారం చేస్తోంది. జిల్లాలో జరుగుతున్న కు.ని.చికిత్సల వివరాలు చూస్తుంటే కేవలం మహిళలే ఆ బాధ్యత తీసుకుంటున్నారని, పురుషుల జాడ కనిపించడంలేదని అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఒకరకమైన అపోహ కారణమని వారు పేర్కొంటూ ఇది నిజం కాదని పురుషులు కూడా ముందుకు రావాలంటున్నారు. మాతృత్వం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న మహిళకు అండగా ఉండాలని కోరుతూ కు.ని. చికిత్సలపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయడానికి కార్యాచరణ రూపొందించారు.  

అపోహలు వద్దు..

కు.ని.చికిత్సల్లో పురుషులకు వేసెక్టమీ చేస్తారు. పురుషుల్లో మాత్రం దీనిపై పలు అపోహలున్నాయి. ప్రధానంగా తమ మగతనం దెబ్బతింటుందని భావిస్తూ విముఖత చూపుతున్నారని వైద్యులు తెలిపారు. ఇది పూర్తిగా తప్పని, ఎలాంటి లోపం ఉండదని చెబుతున్నారు.
* జిల్లాలో రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక్కరూ ఈ ఆపరేషన్‌ చేయించుకోలేదన్నారు. కు.ని. చేయుంచుకున్న మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.660 నుంచి రూ.880, పురుషులకు రూ.1,100 అందజేస్తున్నా పురుషులు ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు.

ఒక్కరంటే ఒక్కరూ లేరు

జిల్లాలో గతేడాది ఏప్రిల్‌- నవంబర్‌ నెలల మధ్య 1065 మందికి కు.ని. ఆపరేషన్లు చేశారు. వీరంతా మహిళలే         కావడం గమనార్హం.  
* 2021-2022 మార్చి వరకు 1419 మంది కు.ని. ఆపరేషన్లు జరిగితే ఈ జాబితాలో కూడా పురుషులు లేరు.  
ఊరేగింపుల ద్వారా ప్రచారం
పురుషులు కు.ని.కి చొరవ చూపే విధంగా చేసేందుకు జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఊరేగింపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి తాజగా గోడపత్రికను కూడా విడుదల చేశారు. వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  

సందేహాలు వద్దు.. ముందుకు రండి

- డాక్టర్‌ పవిత్ర, కు.ని.కార్యక్రమ అధికారిణి

కు.ని.ఆపరేషన్ల విషయంలో పురుషులు కూడా బాధ్యతగా ముందుకు రావాలి. ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేస్తాం. ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం వచ్చిన అర్హులైన వారందరినీ కు.ని. చేసుకోవాలని సూచిస్తున్నాం. తాండూరు, వికారాబాద్‌లలో ప్రచారం చేస్తున్నాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు