logo

Talasani: మరో 20 ఏళ్లు తెరాసదే అధికారం: తలసాని

తెలంగాణలో మరో 20 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

Updated : 28 Nov 2022 08:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మరో 20 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ పార్టీకి విజయ సోపానాలని పేర్కొన్నారు. భాజపా ఒక గాలి బుడగ వంటిందని, ఆ పార్టీ తాటాకు చప్పుళ్లకు తెరాస భయపడేది లేదని చెప్పారు. ఆదివారం తెలంగాణభవన్‌లో తెరాస హైదరాబాద్‌ జిల్లా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. హైదరాబాద్‌ నగర పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు తలసాని, మహమూద్‌అలీ, ప్రభుత్వ విప్‌ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, సాయన్న, ఉప మేయర్‌ మోతె శ్రీలత, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌, కార్పొరేషన్‌ ఛైర్మన్లు రావుల శ్రీధర్‌రెడ్డి, గజ్జెల నగేష్‌, నాయకులు దాసోజు శ్రవణ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రసన్న, నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జిలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు.

హైదరాబాద్‌ మా అడ్డా.. ‘‘కేసీఆర్‌ అంటే అభివృద్ధి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం ప్రగతిని సాధిస్తోంది. తెరాస జాతీయ పార్టీగా మారుతుందని భాజపాలో భయాందోళన మొదలైంది. అభివృద్ధి అంటే భాజపాకు తెలియదు. ఈడీ, ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోంది, మంత్రి మల్లారెడ్డి ఇంటికి వెళ్లిన ఐటీ అధికారులు ఆయన ఫోన్‌ ఎట్లా లాక్కుంటరు? ఆయన కుమారుడు ఆసుపత్రిలో ఉంటే కూడా వదల్లేదు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, రేపు మాకు కూడా సమయం వస్తది. మా కార్యకర్తలు 60 లక్షల మంది దిల్లీపై దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది.. మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో అతీగతీ లేదు. అన్ని నియోజకవర్గాల్లో తెరాస నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన అనంతరం నిజాం కళాశాల మైదానంలో బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తాం’’ అని వివరించారు. హోం మంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ తెరాసకు ప్రజలు, కార్యకర్తలే అండ అని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతూ స్థానిక సమస్యలు గుర్తించి పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలన్నారు. బూత్‌ కమిటీల నియామకం చేపట్టాలన్నారు. యువతను ప్రోత్సహించి, ఉద్యమకారులకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు