logo

పాతబస్తీలోనూ పట్టాలెక్కించండి

మెట్రోరైలు రెండోదశ పనులకు వచ్చేనెలలో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పాతబస్తీ మెట్రో పనులు మొదలెట్టాలనే డిమాండ్లు మరోసారి తెరపైకి వచ్చాయి.

Updated : 28 Nov 2022 02:56 IST

మెట్రో విమానాశ్రయ మార్గం

ప్రకటనతో తెరపైకి పాత డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు రెండోదశ పనులకు వచ్చేనెలలో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పాతబస్తీ మెట్రో పనులు మొదలెట్టాలనే డిమాండ్లు మరోసారి తెరపైకి వచ్చాయి. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మొదటి దశలోనే పూర్తిచేయాల్సిన పనులు అలైన్‌మెంట్‌ వివాదాలతో నిలిచిపోయాయి. బడ్జెట్‌లో ఈ ఏడాది రూ.500 కోట్ల కేటాయింపులు ప్రకటించినా.. మంజూరు లేకపోవడంతో పనులు ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
హైదరాబాద్‌ మెట్రో మొదటిదశలో జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించారు. పాతబస్తీలో మత కట్టడాల మీదుగా అలైన్‌మెంట్‌ వెళుతోందని.. దీన్ని మార్చాలని ఎంఐఎం పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై ఎటూ తేలకపోవడంతో ఆ కొద్ది మార్గం ఆగిపోయింది.

రూ.2 వేల కోట్లు అవసరం..

ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ఆరు స్టేషన్లు రానున్నాయి. సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, శంషేర్‌గంజ్‌, జంగమ్మేట్‌, ఫలక్‌నుమాలో స్టేషన్లు రానున్నాయి. ఫలక్‌నుమాలో డిపో కోసం 15 ఎకరాలు స్థలం కేటాయించారు. వాస్తవంగా పీపీపీలో ఈ ప్రాజెక్టు పూర్తిచేయాల్సి ఉంది. ఆలస్యం కావడం.. నిర్మాణ వ్యయం పెరగడంతో ఎల్‌ అండ్‌ టీ మెట్రో పాతబస్తీ పనులను చేయలేమని సర్కారుకు చెప్పింది. ప్రభుత్వం సైతం సమ్మతించింది. ఇప్పుడు ఈ పనులు ప్రభుత్వ నిధులతో చేపట్టాల్సి ఉంది. రూ.2వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ పనులు చేపట్టాలని కొద్దిరోజుల క్రితమే ఎంఐఎం, భాజపా నేతలు మెట్రోరైలు ఎండీని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. తాజాగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ట్వీటర్‌లో మంత్రి కేటీఆర్‌ను ఆదివారం కోరారు. సీఎం వచ్చే నెలలో రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు చేపట్టనున్న మెట్రో పనులకు ప్రారంభోత్సవం చేయబోతున్నారని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేయడంతో పాతబస్తీ పనులు కూడా మొదలెట్టాలని అసదుద్దీన్‌ కోరారు.


వెంటనే మొదలెట్టాలి..

‘‘ఉద్యోగాలు చేసేందుకు పాతబస్తీ నుంచి ఎంతోమంది యువకులు హైటెక్‌సిటీ వరకు ప్రయాణిస్తున్నారు. ఈ పనులు పూర్తిచేయడం చాలా కీలకం. ఈ ఏడాది బడ్జెట్‌లోరూ.500 కోట్లు ప్రకటించారు. వెంటనే పనులు మొదలెట్టాలి’’

ట్వీటర్‌లో ఏఐఎంఐఎం అధినేత,  హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని