logo

నీటిసంపులో పడి ఆరేళ్ల చిన్నారి దుర్మరణం

అప్పటివరకు ఆడుకుంటూ.. కేరింతలు కొడుతున్న అన్నదమ్ములు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డారు.. ఒకరు సకాలంలో వైద్యమందక చనిపోగా మరొకరి పరిస్థితి విషమం.

Published : 28 Nov 2022 02:04 IST

సోదరుడైన మరో బాలుడి పరిస్థితి విషమం

బాలానగర్‌, న్యూస్‌టుడే: అప్పటివరకు ఆడుకుంటూ.. కేరింతలు కొడుతున్న అన్నదమ్ములు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డారు.. ఒకరు సకాలంలో వైద్యమందక చనిపోగా మరొకరి పరిస్థితి విషమం. ఈ విషాద ఘటన ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని తనుబొద్దువారిపాలెంకు చెందిన మస్తాన్‌రెడ్డి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌ పటాన్‌చెర్వులో నివాసముంటున్నారు. బాలానగర్‌ మండలం శేరిగూడెం శివారులోని ఓ వెంచరులో ఇంటి స్థలం చూసేందుకు ఆదివారం ఉదయం ఇద్దరు కుమారులు పవన్‌ అనీష్‌రెడ్డి(8), యువమనోజ్‌రెడ్డి(6)లను వెంటతీసుకొచ్చాడు. వెంచరులోని భవనం పైకి ఎక్కి చుట్టూ స్థలాలను పరిశీలిస్తున్నాడు. మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో భవనానికి చేరువలో ఆడుకుంటున్న చిన్నారులిద్దరు పక్కనేఉన్న నీటిసంపులో పడిపోయారు. కొద్దిసేపటికి కిందికి దిగివచ్చిన మస్తాన్‌రెడ్డి, ఆయన సహచరులు నీటి సంపులో అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలను బాలానగర్‌లోని పీఎంపీకి, అక్కడి నుంచి బాలానగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు అందుబాటులో లేరు. అక్కడ ఆక్సిజన్‌ కూడా లేదు. 108కు ఫోన్‌ చేయగా అప్పటికే వేరే కేసు కోసం వెళ్లింది. వాయిల్‌కుంట సర్పంచి గోపీనాయక్‌ ఇద్దరు పిల్లలను తన కారులో షాద్‌నగర్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువ మనోజ్‌రెడ్డి మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. అపస్మారక పరిస్థితిలో ఉన్న పవన్‌ అనీష్‌రెడ్డికి చికిత్స అందిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు