logo

‘గుర్తింపు’ రద్దు.. నిర్వహణకు లేదు అడ్డు

కుత్బుల్లాపూర్‌ మండలం సుభాష్‌నగర్‌ గంపలబస్తీలో కొన్నేళ్ల కిందట జీనియస్‌ పాఠశాల ఏర్పాటు చేశారు. భవనలీజు నకిలీ పత్రాలతో అనుమతి పొందారు.

Published : 28 Nov 2022 02:02 IST

కొన్ని ప్రైవేటు పాఠశాలల దందా

గంపలబస్తీ.. నిర్మాణ పనులు జరుగుతున్న భవనంలోనే ప్రమాదకరంగా తరగతుల నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, జీడిమెట్ల: కుత్బుల్లాపూర్‌ మండలం సుభాష్‌నగర్‌ గంపలబస్తీలో కొన్నేళ్ల కిందట జీనియస్‌ పాఠశాల ఏర్పాటు చేశారు. భవనలీజు నకిలీ పత్రాలతో అనుమతి పొందారు. రెండు నెలల క్రితం పాఠశాల గుర్తింపును అధికారులు రద్దు చేశారు. సుమారు 300 మంది విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేశారు. తరువాత వేరొక భవనంలో పాఠశాలను యథావిధిగా నడిపిస్తున్నారు. గుర్తింపు లేకున్నా.. అసంపూర్తిగా ప్రమాదకరంగా ఉన్న భవనంలో పిల్లలకు తరగతులు బోధిస్తున్నారు. విద్యాశాఖాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.

క్షేత్రస్థాయి తనిఖీలేవీ..?

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రైవేటు విభాగంలో 4,670 పాఠశాలలున్నాయి. అగ్నిమాపక శాఖ, ట్రాఫిక్‌, విద్యాశాఖాధికారులను మచ్చిక చేసుకుని అనుమతులు తెచ్చుకుంటున్నారు. సొంత భవనాలు లేకపోతే పదేళ్ల కాలానికి లీజు అగ్రిమెంట్‌ సమర్పించాలి. నకిలీ పత్రాలు సృష్టిస్తున్నాయి. వీటిని గుర్తించి రద్దు చేయాల్సిన బాధ్యత విద్యాశాఖాధికారులపై ఉంది. ఏటా గుర్తింపు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై తనిఖీలు చేసి సీజ్‌ చేస్తున్నామని ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో బోర్డులు, పేర్లు, భవనాలు మార్చుకుని పాఠశాలలను యాజమాన్యాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నాయి. ఇటీవల బంజారాహిల్స్‌లో డీఏవీ పాఠశాల ఘటన తర్వాత ఏడో తరగతి తర్వాత అనుమతి లేదని తేలింది.

అనుమతి ఒకచోట.. నడిపేది మరోచోట

బహదూర్‌పురాలో పాఠశాలలకు అనుమతి తీసుకుని రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆరాంఘర్‌ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారని గతంలోనే విద్యాశాఖకు ఫిర్యాదులందాయి. జూబ్లీహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ పాఠశాల సైతం వేరొకచోట అనుమతి తీసుకుని ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తేలింది. జిల్లాల విద్యాశాఖ మధ్య సమన్వయం లేక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆగడాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు