logo

భావోద్వేగం.. ఆనందబాష్పం

వారంతా అవయవదానాలు చేసిన వారికి కావాల్సిన కుటుంబీకులు.. తమ ఇంట్లోని ఆత్మీయబంధం బ్రెయిన్‌డెడ్‌ అయ్యి, అచేతనంగా ఉన్నాడని తెలిసి...

Published : 28 Nov 2022 02:02 IST

సత్కారం వేళ ఆత్మీయులను తలచుకున్న అవయవదాతల కుటుంబీకులు

తన వారిని తలుచుకుని విలపిస్తున్న ఓ అవయవదాత కుటుంబ

సభ్యురాలిని ఓదార్చుతున్న మంత్రి హరీశ్‌రావు

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: వారంతా అవయవదానాలు చేసిన వారికి కావాల్సిన కుటుంబీకులు.. తమ ఇంట్లోని ఆత్మీయబంధం బ్రెయిన్‌డెడ్‌ అయ్యి, అచేతనంగా ఉన్నాడని తెలిసి... పుట్టెడు శోకంలోనూ వారికి చెందిన అవయవాలను దానం చేయాలనే సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్న ఉదార స్వభావులు... అలాంటివారిని సత్కరించి, అవయవదానాన్ని ప్రోత్సహించేలా ప్రజలను చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమావేశానికి తరలివచ్చారు. ‘నేషనల్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ డే’ను పురస్కరించుకుని ఆదివారం గాంధీ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. అవదానం చేసిన 162 మంది దాతల కుటుంబాలను మంత్రి హరీశ్‌రావు, ఇతర అధికారులు ఘనంగా సత్కరించారు. అలాగే, అవయవాల దానంలో వారు చూపిన తెగువ, సామాజిక స్పృహ వెలకట్టలేనిదంటూ కీర్తించారు. ఈ సందర్భంగా సంబంధిత కుటుంబసభ్యుల్లో ఎనలేని ఉద్విగ్నత చోటుచేసుకుంది. తమ ఆత్మీయులు మరణించార[నే జ్ఞాపకాలు గుండెల్లో కదులుతూ కన్నీరు తెప్పిస్తున్నా.. అవయవాల దానంతో వారు మరొకరి రూపంలో బతికి ఉన్నారనే భావన, అందుకు తమను గుర్తించి సత్కరిస్తున్నందుకు కురిసిన ఆనందబాష్పాల నడుమ కార్యక్రమం మరపురాని సంతోషాన్ని కలిగించింది. కొందరైతే సత్కారాన్ని స్వీకరిస్తున్నప్పుడు కన్నీటిపర్యంతమయ్యారు.


అమ్మ చనిపోయినా...: కల్పన, చేవెళ్ల

రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మా తల్లి బుర్జుకాడి లక్ష్మిని ఆసుపత్రిలో చేర్పిస్తే బ్రెయిన్‌డెడ్‌ అయ్యిందని, మీరు అంగీకరిస్తే ఆమె అవయవాలు వేరేవారికి అమర్చుతామని వైద్యులు చెప్పారు. కుటుంబసభ్యులమంతా మాట్లాడుకుని అందుకు అంగీకరించాం. మా తల్లి చనిపోయినా మరో ఐదుగురికి ప్రాణం పోసిందనే సంతృప్తి మిగిలింది.


పనికిరాలేదు.. అయినా సత్కరించారు: రూపశ్రీ, లింగంపల్లి

నా భర్త రవిబసయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చాక బ్రెయిన్‌డెడ్‌ అయ్యారని చెప్పారు. అవయదానం గురించి వైద్యులు వివరించడంతో అందుకు అంగీకరించాను. అయనకు క్యాన్సర్‌ ఉండడంతో అవయవాలు పనికిరావన్నారు. అయితే, అవయదానానికి నేను ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా నన్ను పిలిచి సత్కరించారు.


కుమార్తె దూరమైన బాధలోనూ..: చంద్రశేఖర్‌, కృష్ణవేణి, హన్మకొండ

మా కుమార్తె అభినిత రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో బ్రెయిన్‌డెడ్‌ అయిందనే బాధ మమ్మల్ని కలచివేసింది. వైద్యులు అవయదానం గురించి వివరించగానే అంగీకరించాం. ఆమె నుంచి సేకరించిన అవయవాలను మరో ఐదుగురికి అమర్చారని తెలిసి కాస్తంత తేరుకున్నాం. ఈ నేపథ్యంలో మీ అంగీకారం గర్వించదగిందంటూ సత్కరించడం పట్ల సంతోషంగా ఉంది.


ఏడుగురి ప్రాణాలు నిలబడ్డాయి: నాగమల్లేశ్‌, నాగర్‌కర్నూల్‌

మా నాన్న బాలయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్‌ అయ్యాడు. అప్పటికే అవయవదానంపై కొంత అవగాహన ఉన్న, మాకు డాక్టర్లు పరిస్థితి వివరించగానే అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నాం. అనంతరం మానాన్న నుంచి తీసుకున్న అవయవాలతో ఏడుగురి ప్రాణాలు కాపాడినట్లు వైద్యులు చెప్పారు. ఫలితంగా ఈ రోజు సత్కారం అందుకోవడం గర్వంగా అనిపించింది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని