logo

భవనాల కొరత.. పాలనకు వెత!

జిల్లాలోని 566 పంచాయతీల్లో 336కు సొంత భవనాలున్నాయి. మిగిలిన వాటికి లేవు. పక్కా భవనాలు కూడా  శిథిలావస్థకు చేరాయి.

Updated : 28 Nov 2022 04:20 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి

* వికారాబాద్‌ మండలం గోధుమగూడ పంచాయతీ భవన నిర్మాణానికి రెండేళ్ల కిందట పనులు చేపట్టారు. స్లాబ్‌ వేసి వదిలిపెట్టారు. కార్యకలాపాలు పాత  భవనంలోనే కొనసాగుతున్నాయి .


* పూడూరు మండలం కడ్మూర్‌లో భవనం పూర్తిగా శిథిలమైంది. కొత్తది నిర్మించాలని పనులు చేపట్టినా, గతేడాది  నిలిపివేశారు. కోట్‌పల్లిలో మండలంలోనూ పాత భవనంలో కొనసాగుతోంది.

గోధుమగూడలో నిలిచిపోయిన పంచాయతీ భవనం

జిల్లాలోని 566 పంచాయతీల్లో 336కు సొంత భవనాలున్నాయి. మిగిలిన వాటికి లేవు. పక్కా భవనాలు కూడా  శిథిలావస్థకు చేరాయి. కొన్ని చోట్ల అరకొర గదులు అవసరాలకు సరిపోవటం లేదు. కొత్తగా ఏర్పాటు చేసిన  పంచాయతీల కార్యకలాపాలు అద్దె, ఉచిత, పాఠశాల, కమ్యూనిటీ కేంద్రాలు, అంగన్‌వాడీ భవనాల్లో కొనసాగుతున్నాయి.  ప్రతి మండలంలో 10 నుంచి 15 వరకు కొత్తగా పంచాయతీలు ఏర్పాటయ్యాయి. పూడూరు మండలంలోనే కొత్తగా 9  ఏర్పాటు చేయడంతో మొత్తం 31 అయ్యాయి. సొంత భవనాలున్న పంచాయతీల్లో 50కి పైగా శిథిలావస్థకు చేరాయి.  వాటికి మరమ్మతు చేసేందుకు నిధులు మంజూరు కావడం లేదు. కొత్త పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి అదే పరిస్థితి.  

రెండు గదులు మాత్రమే

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన వాటిల్లోని భవనాలను రెండు గదులతో నిర్మించారు. సర్పంచి ఒక గదిలో కూర్చుని మరొక గదిలో సామగ్రి నిల్వ చేస్తున్నారు. కార్యదర్శికి ప్రత్యేక గది అంటూ లేదు. కొన్నింటికి ప్రహరీలు లేవు. ట్రాక్టర్లు, ట్రక్కులు, ట్యాంకర్లు భవనం పక్కనే రాత్రిళ్లు ఉంచుతున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో కొత్తగా 20 వరకు భవనాలు నిర్మాణ పనులు చేపట్టారు.


ప్రతిపాదనలు పంపాం

జిల్లాలో పక్కా భవనాలు లేని పంచాయతీలను కొత్తగా భవనాలను మంజూరు చేయాలని కోరుతూ ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపాం. పాత భవనాల్లో కొన్ని చాలా చిన్నవిగా ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో భవనాలు లేవు. మధ్యలో నిలిచిపోయిన వాటి గురించి తెలిపాం.

మల్లారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి, వికారాబాద్‌

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని