logo

గనులను కొల్లగొట్టి.. ఆదాయానికి గండికొట్టి!

విలువైన సహజ సంపదను కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. అనుమతుల్లేకుండా తవ్వకాలు చేపడుతూ నిక్షేపాలను కొల్లగొడుతూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.

Published : 28 Nov 2022 02:02 IST

అధికారులు దృష్టిసారిస్తేనే అడ్డుకట్ట
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

మల్కాపూర్‌ ప్రభుత్వ భూమిలో..

విలువైన సహజ సంపదను కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. అనుమతుల్లేకుండా తవ్వకాలు చేపడుతూ నిక్షేపాలను కొల్లగొడుతూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇంత వ్యవహారం జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదు. జిల్లాలోని పంతొమ్మిది మండలాల్లో 5,596 ఎకరాల్లో సుద్ద, ఎర్రమట్టి, నాపరాయి, నల్ల, ఎర్ర కంకర, ఇసుక, పలుగురాళ్లు వంటి విలువైన ఖనిజాల భూములున్నాయి. వీటిలోని సహజ సంపదను తవ్వేందుకు గనులు భూగర్భ వనరులు, రెవెన్యూ, పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి, నీటి పారుదల, అటవీ శాఖల అనుమతి పొందాల్సి ఉంది. అనంతరం గనుల శాఖ అధికారులు సూచించిన మేరకు రుసుం, డెడ్‌రెంట్‌, సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఇవేమీ పూర్తి చేయకుండా నేరుగా యంత్రాలతో ప్రభుత్వ, పట్టా భూముల్లోని నాపరాయిని తవ్వేస్తున్నారు. రాత్రిపగలు నిర్విరామంగా కొనసాగిస్తూ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌, గోవా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇతర జిల్లాలకు లారీల్లో చేరవేస్తున్నారు. తద్వారా రోజుకు రూ.10వేలకుపైగా ఆదాయంతో నెలకు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుంకానికి ఎగనామం పెడుతున్నారు.

ఎక్కడంటే: ఓగీపూర్‌ సర్వే సంఖ్య 129, కరణ్‌కోటలో 2 సర్వే సంఖ్యలో, మల్కాపూర్‌లో 15, 116 సర్వే సంఖ్యల్లోని సర్కారు భూములతోపాటు పరిసరాల్లోని పట్టాభూముల్లో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోంది. స్థానికులు ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు హడావుడి చేసి, అనంతరం మిన్నకుంటున్నారు. ఫిర్యాదు చేసిన గనుల కార్యకలాపాలను మాత్రమే పరిశీలించి, మిగతా వాటిపై చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. నాపరాయి తవ్వకాలకు యంత్రాలను వినియోగిస్తున్నారు. వాటిని జప్తు చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.


సమాచారం అందగానే చర్యలు

చిన్నప్పలనాయుడు, తహసీల్దారు, తాండూరు

ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాల సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఈమధ్యే కరణ్‌కోట, సంగెంకలాన్‌లో పదమూడు గనుల్లో చేపట్టిన తవ్వకాలను నిలిపివేయించి, యంత్రాలను కార్యాలయానికి తరలించాం. వీఆర్‌ఓలను ఇతర శాఖల విధుల్లో నియమించడంతో సిబ్బంది కొరత ఏర్పడినప్పటికీ అందుబాటులో ఉన్న గిర్దావర్‌, వీఆర్‌ఏలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అనుమతుల్లేకుండా తవ్వకాలు చేపడితే ఉపేక్షించం.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు