Bandi Sanjay: బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు అనుమతించింది. 

Updated : 28 Nov 2022 13:07 IST

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు అనుమతించింది. నిర్మల్‌ జిల్లా భైంసా నుంచి ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టేందుకు సంజయ్‌ వెళ్తుండగా ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌ శివారులో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. యాత్ర ప్రారంభోత్సవ సభ భైంసాకు 3 కి.మీ. దూరంలో ఉంటేనే అనుమతించాలని పోలీసులకు స్పష్టం చేసింది.

పిటిషనర్ల తరఫున న్యాయవాది రామచందర్‌రావు వాదనలు వినిపించారు. భైంసా పట్టణం మీదుగా పాదయాత్ర వెళ్లదని తెలుపుతూ రూట్‌మ్యాప్‌ వివరాలను న్యాయస్థానానికి సమర్పించారు. పట్టణంలోని ప్రవేశించకుండా వై జంక్షన్‌ నుంచి మాత్రమే కొనసాగుతుందని వివరించారు. భైంసా పట్టణంలోకి పాదయాత్ర వెళ్లనపుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) స్పందిస్తూ.. ఆ ప్రాంతం చాలా సున్నితమైనదని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. సంజయ్‌ పాదయాత్రకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని