logo

రద్దీ తక్కువ.. ప్రమాదాలు ఎక్కువ

మాదాపూర్‌ సైబర్‌టవర్స్‌ ఫ్లైఓవర్‌పై ఇటీవల ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయింది. చోదకుడు సహా మరొకరు మరణించారు. ప్రమాదానికి కారణం.. రోడ్డు ఖాళీగా ఉందని హెల్మెట్‌ కూడా లేకుండా అతివేగంతో వెళ్లడమే.  

Published : 29 Nov 2022 04:37 IST

ఖాళీ రోడ్లపై మితిమీరిన వేగం..

ఈనాడు, హైదరాబాద్‌: మాదాపూర్‌ సైబర్‌టవర్స్‌ ఫ్లైఓవర్‌పై ఇటీవల ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయింది. చోదకుడు సహా మరొకరు మరణించారు. ప్రమాదానికి కారణం.. రోడ్డు ఖాళీగా ఉందని హెల్మెట్‌ కూడా లేకుండా అతివేగంతో వెళ్లడమే.  

ఖాళీ రోడ్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. మితిమీరిన వేగంతో దూసుకెళ్లడం, నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రమాదాలకు దారితీస్తున్నాయి. మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా జరిగే వాటిలో సగటున 35 శాతం రహదారులు ఖాళీగా ఉన్న సమయంలో.. అదీ రాత్రి ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

గతంలో అధ్యయనం.. నగరంలో ఏటా 8 వేలకుపైగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 1500 మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు.  సగటున 2800 సంఘటనలు రద్దీ అంతగా లేని సమయంలో చోటుచేసుకొంటున్నాయి. ఏ సమయంలోనైనా కచ్చితంగా నిబంధనలు పాటించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు. రాత్రి వేళ సిగ్నళ్లను పట్టించుకోకుండా దూసుకెళ్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పోలీసులు విశ్లేషించారు.

ఇవీ కారణాలు

* అతి వేగంతో వెళ్తూ.. వాహనాన్ని అదుపుచేయలేకపోవడం

* ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోవడం ః కూడళ్ల దగ్గర సిగ్నల్‌ జంప్‌  

* అపసవ్య దిశలో రాకపోకలు

* సాయంత్రం 6 తర్వాత ఇంటికి త్వరగా వెళ్లాలన్న హడావుడి

* మద్యం తాగి ఆ మత్తులో నడపడం  

* ముందు వెళ్తున్న వాహనాన్ని దాటేయాలన్న ఆతృత

* ఫోన్లో మాట్లాడుతూ.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడం


నియంత్రణ ఎలా..

* రోడ్డు ఖాళీగా ఉన్నా పరిమిత వేగంతోనే వెళ్లాలి

* ఇతర వాహనాలను చూసి పోటీ పడకూడదు

* పగటి సమయంతో పోలిస్తే రాత్రివేళ ఏకాగ్రత తగ్గుతుంది. దూరంగా ఉండేవి పూర్తిగా కనిపించవు. నిద్రమత్తులో డ్రైవింగ్‌కు దూరం ఉత్తమం.

* అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజాము సమయంలోనైనా సిగ్నళ్ల దగ్గర దూకుడుగా వెళ్లకూడదు. రెడ్‌సిగ్నల్‌ పడితే కచ్చితంగా వాహనం ఆపాలి.

* రహదారిపై ఎవరూ లేరన్న ధైర్యంతో రాంగ్‌రూట్‌లో అసలు వెళ్లకూడదు.

* వంపులు తిరిగి ఉండే  దారులపై సూచికలను చూస్తూ నెమ్మదిగా వెళ్లాలి.

* వేగంగా వెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న వాహనానికి కనీసం 50 మీటర్ల దూరంలో ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని