logo

ఇళ్లల్లో చోరీలు చేస్తున్న పాత నేరస్థుడి అరెస్టు

చెడు వ్యసనాలు.. జల్సా జీవితం అతడ్ని దొంగగా మార్చాయి. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడం .. తండ్రి పట్టించుకోకపోవడంతో చదువుకు దూరమయ్యాడు. విలాసాలకు అలవాటుపడి స్నేహితులతో కలిసి చోరీల బాట పట్టాడు.

Published : 29 Nov 2022 04:37 IST

తెలుగు రాష్ట్రాల్లో 25 వరకు..

మేడిపల్లి (బోడుప్పల్‌), న్యూస్‌టుడే: చెడు వ్యసనాలు.. జల్సా జీవితం అతడ్ని దొంగగా మార్చాయి. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడం .. తండ్రి పట్టించుకోకపోవడంతో చదువుకు దూరమయ్యాడు. విలాసాలకు అలవాటుపడి స్నేహితులతో కలిసి చోరీల బాట పట్టాడు. తెలుగు రాష్ట్రాల్లో 25 వరకు చోరీలు చేశాడు. మల్కాజిగిరి డీసీపీ రక్షితా కెమూర్తి.. తన కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. కర్నూలుకి చెందిన పసుపతి శ్రీరాములు అలియాస్‌ కిన్నెర శివరాం, అలియాస్‌ పసుపులేటి శ్రీరాములు అలియాస్‌ శివ(50) కార్మికుడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో మేనత్త దగ్గర పొలం పనులకు వెళ్లేవాడు. పెద్దయ్యాక కర్నూలుకు వచ్చి హోటల్‌లో కార్మికుడిగా పనిచేశాడు. అనంతరం హైదరాబాద్‌లో కూలిపనులు చేశాడు.  1990లో నగరంలోని మహంకాళి పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో స్నేహితులు వెంకటేష్‌, ఆనంద్‌తో కలిసి చోరీచేసి జైలుకు వెళ్లి వచ్చాడు. విజయవాడ, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, ఒంగోలులో చోరీలు చేశాడు. 2018లో కర్నూలు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2021 జూన్‌లో విడుదలై మళ్లీ చోరీల బాటపట్టాడు. సోమవారం ఘట్‌కేసర్‌ అన్నోజిగూడలో అనుమానాస్పదంగా వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా గుట్టు విప్పాడు. అతనిపై 15చోరీ కేసులు నమోదు చేసి 25 తులాల బంగారు నగలు, 500 గ్రాముల వెండి వస్తువులు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి ఏసీపీ నరేష్‌రెడ్డి, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ గోవర్దన గిరి, డీఐ ప్రవీణ్‌బాబు, డీఎస్సై లక్ష్మణ్‌, ఎస్సై తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. నేరస్థుడిని పట్టుకున్న పోలీసులను డీసీపీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని