logo

గాలి నాణ్యత లెక్కలు గ్రేటర్‌కేనా!

పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు, గాలి స్వచ్ఛంగా ఉందా.. లేదో తెలుసుకునేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో కాలుష్య లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కొన్నేళ కిందట ఆదేశాలు జారీ చేసింది.

Published : 29 Nov 2022 04:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు, గాలి స్వచ్ఛంగా ఉందా.. లేదో తెలుసుకునేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో కాలుష్య లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కొన్నేళ కిందట ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య తీవ్రతను గుర్తించి ఆన్‌లైన్‌ ద్వారా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెబ్‌సైట్‌లో గంటకోసారి అప్‌డేట్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి బాధ్యతలు అప్పగించింది. ఆ మేరకు సీపీసీబీ అధికారులు వివరాలు కోరుతుండటంతో నాలుగైదేళ్లుగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు కాలుష్య లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఐదు కంటే ఎక్కువ నగరాలు, పట్టణాల్లో కాలుష్య లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేయగా, మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే వాయు నాణ్యత సూచీలున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రధాన జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోనూ ఏర్పాటుచేస్తే వాయు కాలుష్యం హెచ్చుతగ్గులకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

కర్ణాటకలో అత్యధికం

కేంద్రం ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వం వేగంగానే స్పందించింది. బెంగుళూరు నగరం సహా పందొమ్మిది పట్టణాల్లో కాలుష్య లెక్కింపు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తమిళనాడులో చెన్నై సహా 13 నగరాలు, పట్టణాల్లో ఈ సూచీలు ఉన్నాయి. ఏపీలోనూ అమరావతి, అనంతపురం, చిత్తూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో కాలుష్య లెక్కింపు కేంద్రాలున్నాయి.

నియంత్రణ చర్యలు చేపట్టేందుకు వీలుగా..

గాలి నాణ్యత సూచీలో నమోదైన కాలుష్య తీవ్రతను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెబ్‌సైట్‌లో గంటకోమారు నవీకరించడం ద్వారా ఏఏ నగరాల్లో కాలుష్యం ఎంతుందో తెలుసుకోవడంతో పాటు అక్కడి ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేందుకు వీలుంటుంది. దిల్లీలో ఏర్పాటుచేసిన కాలుష్య లెక్కింపు కేంద్రాలతోనే అక్కడి కాలుష్య తీవ్రత ప్రజలకు తెలిసింది. దిల్లీ ప్రభుత్వం కొద్దిరోజుల కింట పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కాలుష్య తీవ్రత తగ్గగానే మళ్లీ యథావిధిగా కార్యకలాపాలు మొదలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని