logo

అర్ధరాత్రి అరాచకాలు.. చెరువులు... నాలాల్లో రసాయన వ్యర్థాలు

ప్రాణాధార మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలు.. ఆహార పదార్థాలు, నూనెలను ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమలు.. వాటిద్వారా విడుదలవుతున్న ప్రాణాంతక రసాయనాలను చెరువులు, నాలాల్లో పారపోబోస్తున్నారు.

Updated : 29 Nov 2022 06:06 IST

జీడిమెట్ల, కాటేదాన్‌ పరిశ్రమల బరితెగింపు
రాత్రివేళ ప్రత్యేక వాహనాల్లో తరలింపు


ఓ నాలాలో ప్రవహిస్తున్న ...

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, రాజేంద్రనగర్‌: ప్రాణాధార మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలు.. ఆహార పదార్థాలు, నూనెలను ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమలు.. వాటిద్వారా విడుదలవుతున్న ప్రాణాంతక రసాయనాలను చెరువులు, నాలాల్లో పారపోబోస్తున్నారు. పోలీసులు, కాలుష్య నియంత్రణమండలి అధికారుల నిఘాతో కొద్దిరోజుల పాటు కార్యకలాపాలు నిలిపేసినా.. తాజాగా రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లో రసాయన వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నారు. రాజేంద్రనగర్‌-ఆరాంఘర్‌ మధ్యలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోని నాలాల్లో పారబోసేందుకు లారీతో వచ్చిన వారిని స్థానికులు గమనించగా.. మధ్యలో వదిలేసి పారిపోయారు. లారీని పీసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

జీడిమెట్ల..రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో

జీడిమెట్ల, రాజేంద్రనగర్‌ సర్కిళ్లలోని పలు ప్రాంతాలలో పరిశ్రమల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రమాదకర రసాయనాలను ఆయా పరిశ్రమల యజమానులు ఎక్కడికక్కడ వదిలేస్తున్నారు. రసాయనాలను పారబోయడానికి ఈ ప్రాంతంలోని చెరువులు, నాలాలను వినియోగించుకుంటున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భూగర్భంలోనే రసాయనాలను డంప్‌ చేస్తుండగా... కాటేదాన్‌ పారిశ్రామిక ప్రాంతంలోనూ కొన్ని ప్రమాదకర రసాయనాలను పరిశ్రమలు సమీపంలోని నాలాలు, చెరువులను ఎంచుకుంటున్నాయి. జీడిమెట్ల, కాటేదాన్‌, శివరాంపల్లి పరిసర ప్రాంతాలలో రసాయనాల కారణంగా ఘాటు వాసనలు వస్తున్నాయని స్థానికుల ఫిర్యాదు నేపథ్యంలో పీసీబీ అధికారులు నిఘా ఉంచగా.. జీడిమెట్ల పారిశ్రామిక వాడనుంచి వచ్చిన ఒకలారీ ఆరాంఘర్‌ ప్రాంతంలోని నాలాలో రసాయనాలు వేస్తుండగా పట్టుకున్నారు.

ఖర్చు దండగ ఎందుకు?

ప్రమాదకర రసాయనాలను బహిరంగ ప్రదేశాలు, జలవనరుల్లో విడవకూడదు. రసాయనాల తీవ్రత తగ్గించాక కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ఆదేశాలకు అనుగుణంగా పారబోయాలి. ఇదంతా చేసేందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుంది. దీంతో కొందరు పరిశ్రమల యజమానులు పోలీసులకు, పీసీబీ అధికారులకు కంటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చెరువులకు సమీపంలోని రహదారుల వద్ద ఆగి...అర్ధరాత్రి దాటాక పోలీస్‌ పెట్రోలింగ్‌ పూర్తయ్యాక రసాయనాల డ్రమ్ములను చెరువులు, నాలాల్లో వదిలేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని