logo

పేదలకు చేరువగా.. బస్తీ దవాఖానా

ప్రజా ప్రయోజనాల కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలు తాండూరు పట్టణంలో కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉండేవి.

Updated : 29 Nov 2022 06:02 IST

న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌: ప్రజా ప్రయోజనాల కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలు తాండూరు పట్టణంలో కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉండేవి. వాటిని ఉపయోగంలోకి తీసుకు వస్తే ప్రయోజనకరంగా ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు, ప్రజాప్రతినిధులు భావించారు. దీన్లో భాగంగా బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో భవనాల సద్వినియోగంతోపాటు పేదలకు వైద్య సేవలూ లభిస్తున్నాయి.

రూ.29 లక్షలతో వ్యయం: పట్టణంలోని పాత తాండూరు అంబేడ్కర్‌ ఉద్యానంలో 2010లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వ హయాంలో రూ.29లక్షల వ్యయంతో స్థానిక ప్రజల అవసరాల కోసం సామాజిక భవనాన్ని నిర్మించారు. దీంతో పాటు  ఇందిరానగర్‌ హమాలీ బస్తీలోనూ ఇలాంటి భవనమే నిర్మించారు. వాటిలో కొన్నాళ్ల పాటు మహిళా సంఘాలు కార్యకలాపాలు నిర్వహించాయి. ఆ తర్వాత భవనాలు నిరుపయోగంగా మారి చివరకు శిథిలావస్థకు చేరాయి. పర్యవసానంగా అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయి. సమస్యలను పలుమారు ప్రజలు ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురావడంతో స్పందించి నిరుపయోగ భవనాల్లో ఆస్పత్రుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా వాటిని సద్వినియోగంలోకి తెచ్చినట్లయింది.

ఆధునికీకరణ..: ఆయా ప్రాంతాల్లోని రెండు భవనాలను ఆధునికీకరించారు. పాత తాండూరులోని అంబేడ్కర్‌ ఉద్యానంలోని భవనంలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేశారు. ఇదే ఏడాది జులై నెలలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బస్తీ దవాఖానాను ప్రారంభించారు. రోజుకు 120 మంది దాకా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఇక్కడ చికిత్సలు పొందుతున్నారు. రోగ నిర్ధారణ పరీక్షల కోసం ల్యాబ్‌తో పాటు మందులు ఇవ్వటానికి ఫార్మసీ అందుబాటులో ఉంది.

* ఇందిరానగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ రోజుకు 100 మంది దాకా బాధితులు వైద్య సేవలు పొందుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని