logo

నాలాలు మందకొడి..జీతాలకు ముడిపడి

నాలా అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయడంపై జీహెచ్‌ఎంసీ దృష్టిపెట్టింది. డిసెంబరు నెలాఖరుకు అన్ని పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Published : 29 Nov 2022 05:02 IST

గడువులోగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశం


రామంతాపూర్‌ టీవీకాలనీలో కొనసాగుతున్న నాలా నిర్మాణం

ఈనాడు, హైదరాబాద్‌: నాలా అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయడంపై జీహెచ్‌ఎంసీ దృష్టిపెట్టింది. డిసెంబరు నెలాఖరుకు అన్ని పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరికొంత సమయం అవసరమని ఇంజినీర్లు కోరుతుండగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ మాత్రం ససేమిరా అంటున్నారు. గడువులోగా పూర్తి చేయకపోతే.. జనవరి నుంచి జీతంలో 30శాతం కోత విధిస్తానని ఇటీవల జరిగిన సమీక్షలో హెచ్చరించారు. దాంతో ఇంజినీర్లు ఎస్‌ఎన్‌డీపీ(వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం) పనులు పరుగు తీయిస్తున్నారు.

వరదల నుంచి కాపాడేందుకు..

2020 అక్టోబరు నాటి భారీ వర్షాలు, వరదలతో భాగ్యనగరం తీవ్రంగా నష్టపోయింది. ఐదు వందలకుపైగా కాలనీలు నెలల తరబడి వరదలో చిక్కుకున్నాయి. అలాంటి ఉపద్రవం మరోమారు పునరావృతం కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలో నాలాల అభివృద్ధికి ఎస్‌ఎన్‌డీపీ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి.. ఇంజినీర్లను కేటాయించింది. కన్సల్టెన్సీ ద్వారా సర్వే చేయించి.. వేర్వేరు దశల్లో మూసీకి ఇరువైపులా ఉన్న చెరువులన్నింటినీ అనుసంధానం చేయాలని సంకల్పించింది. చెరువుల మధ్య నాలాలను పునరుద్ధరించడమేగాక.. కొత్త వాటినీ నిర్మిస్తోంది. బ్యాంకు రుణం ద్వారా నిధులు సమకూరడంతో పనులు జాప్యం లేకుండా సాగిపోతున్నాయి.

డిసెంబరు చివరికి పూర్తయ్యేవి..

* గుర్రం చెరువు వద్ద కల్వర్టు, అలుగు నిర్మాణం, పల్లెచెరువు తూము, అలుగు నిర్మాణం తుది దశలో ఉన్నాయి.

* అప్పాచెరువు వద్ద 550మీటర్ల పొడవున బాక్స్‌ డ్రెయిన్‌, ప్రహరీ నిర్మాణం, అలుగు పునరుద్ధరణ. నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు

* మన్మానికుంట నూర్‌నగర్‌ నుంచి దక్కన్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌హాల్‌ వరకు 540మీటర్ల నాలా నిర్మాణం పూర్తవుతోంది.

* రాజేంద్రనగర్‌ పిల్లర్‌ నెం.191 దగ్గర పోర్ట్‌ వ్యూ కాలనీలో చేపట్టిన 860మీటర్ల నాలా నిర్మాణం తుది దశలో ఉంది.

* ఎల్బీనగర్‌ జోన్‌లోని బండ్లగూడ చెరువు నుంచి నాగోల్‌ చెరువు వరకు చేపట్టిన నాలా.

* బాతుల చెరువు, శివంరోడ్డు, వీఎస్టీ కూడలి సమీపంలోని నల్లపోచమ్మ దేవాలయం వద్ద చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులు డిసెంబరులో పూర్తవనున్నాయి.

గ్రేటర్‌లో పురోగతి ఇలా..

* మొత్తం 35 పనుల్లో బేగంపేట రసూల్‌పుర వద్ద కల్వర్టు నిర్మాణ పని పూర్తయింది.

* 18 పనులను 2022 ముగిసేనాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. డిసెంబరులో 13 పనులు, మార్చి 2023 నాటికి మిగిలిన నాలాలు పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

శివార్లలో ఇదీ పరిస్థితి

* మొత్తం 21 పనుల్లో 1 నాలా పని పూర్తయింది.

* మిగిలిన వాటిలో రెండు డిసెంబరు చివరినాటికి, నాలుగు పనులు మార్చి 2023 నాటికి పూర్తయ్యే అవకాశముందని ఇంజినీర్లు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని