logo

రోగాన్ని దాచి.. పెళ్లాడి.. బెదిరించి!

తనకున్న తీవ్రమైన రోగాన్ని చెప్పకుండా వివాహం చేసుకుని.. ఆమె మొదటి భర్తతో ఉన్న, వ్యక్తిగత ఫొటోలు చోరీ చేసి బెదిరించిన భర్త, అతడి తల్లిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది.

Updated : 30 Nov 2022 12:18 IST

రెండో భర్త, అతడి తల్లిపై కేసు

జూబ్లీహిల్స్‌: తనకున్న తీవ్రమైన రోగాన్ని చెప్పకుండా వివాహం చేసుకుని.. ఆమె మొదటి భర్తతో ఉన్న, వ్యక్తిగత ఫొటోలు చోరీ చేసి బెదిరించిన భర్త, అతడి తల్లిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడకు చెందిన ఓ మహిళ(25) పారామౌంట్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ అర్సలాన్‌ ఇక్బాల్‌ను ఈ ఏడాది ఆగస్టులో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం. ఇక్బాల్‌కు అప్పటికే ఇద్దరు కుమార్తెలున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే భార్యకు చెందిన టాబ్‌ హాక్‌ చేసి అందులో మొదటి భర్తతో ఉన్నవి, వ్యక్తిగత ఫొటోలను చోరీ చేశాడు. అప్పటి నుంచి ఆమెను దుర్భాషలాడటంతో పాటు చేయి చేసుకొనేవాడు. ఇద్దరికీ రెండో వివాహమని.. అనవసర గొడవలు వద్దని ఆమె చెప్పగా.. కోపోద్రిక్తుడైన ఇక్బాల్‌ కొట్టడానికి యత్నించడంతో ఆమె వాష్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకొంది. తెరవాలని లేదంటే ఆమె ఫొటోలను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆమె అతని తల్లి సల్మ ఖాతూన్‌కి ఫోన్‌ చేసింది. ఆమె అక్కడికి చేరుకోగా, తల్లి ముందే భార్యను తీవ్రంగా కొట్టాడు. అక్కడి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. దీంతో ఆమె తల్లి అల్లుడిని ప్రశ్నించగా పొరపాటు జరిగిందని, మరోసారి ఇలాంటివి జరగవని నమ్మించాడు. తర్వాత భర్త మాత్రలు వాడటం.. దూరంగా ఉండటంతో ప్రశ్నించింది. దీంతో మరోసారి  తీవ్రంగా కొట్టాడు. అతడి వైద్య నివేదికలను పరిశీలించగా క్యాన్సర్‌ ఉందని గ్రహించింది. పెళ్లికి ముందు ఈ విషయం ఎందుకు చెప్పలేదని నిలదీయడంతో తలగడ ముఖంపై పెట్టి చంపడానికి యత్నించారు. అతడి తల్లి అడ్డుకోవడంతో బయటపడిన ఆమె సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సయ్యద్‌ అర్సలాన్‌ ఇక్బాల్‌తో పాటు అతని తల్లి సల్మ ఖాతూన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కొంటామంటూ వచ్చి.. కొట్టేస్తారు!

జూబ్లీహిల్స్‌: ఓఎల్‌ఎక్స్‌లో చరవాణులు విక్రయించే వారిని లక్ష్యంగా చేసుకొని కొనుగోలు చేయడానికి వచ్చి.. బెదిరించి చరవాణులు ఎత్తుకెళ్లే   ముఠాలోని ఇద్దరిని మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి అయిదు చరవాణులు, ఒక కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీ రాధాకిషన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండకు చెందిన మహ్మద్‌ ఇక్రముద్దీన్‌ తన స్నేహితులైన మహ్మద్‌ హసన్‌, మహ్మద్‌ రిజ్వాన్‌లతో కలిసి ఓఎల్‌ఎక్స్‌లో చరవాణులు విక్రయానికి పెట్టేవారిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతుంటారు.  గచ్చిబౌలి ఠాణా పరిధిలో మూడు నెలల క్రితం ఇక్రముద్దీన్‌, మహ్మద్‌ హసన్‌తో కలిసి ఐఫోన్‌-13ను విక్రయానికి పెట్టిన వ్యక్తిని ఐకియా షోరూం వద్దకు రావాలని సూచించారు. వచ్చిన అతడిని మాటల్లో పెట్టి ఐఫోన్‌తోపాటు మరో చరవాణిని తీసుకొని ఉడాయించారు. ఇదే రీతిలో ప్రధాన నిందితుడైన ఇక్రముద్దీన్‌ తన మరో స్నేహితుడైన రిజ్వాన్‌తో కలిసి ఈ నెల 17న విజయేంద్రరెడ్డి అనే యువకుడిని బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి వద్దకు పిలిచి ఐఫోన్‌తోపాటు వివో చరవాణిని తీసుకొని కారులో తీసుకెళ్లి బెదిరించి కేబీఆర్‌ ఉద్యానవనం వద్ద కారులో నుంచి నెట్టేసి పరారయ్యారు.  ఒకే తీరులో ఉన్న రెండు కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇక్రముద్దీన్‌తోపాటు మహ్మద్‌ హసన్‌ను అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు రిజ్వాన్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన మధ్యమండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రఘునాథ్‌, ఎస్సై నవీన్‌కుమార్‌ అతని బృందాన్ని ఆయన అభినందించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు