TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి అప్పగిస్తే వీగిపోవడం ఖాయం: న్యాయవాది దవే

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే వీగిపోవడం ఖాయమని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది  దుష్యంత్‌ దవే హైకోర్టులో వాదించారు.

Updated : 30 Nov 2022 19:34 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే వీగిపోవడం ఖాయమని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే హైకోర్టులో వాదించారు. దేశవ్యాప్తంగా సీబీఐ దర్యాప్తు చేసిన కొన్ని కేసులు వీగిపోయిన ఉదాహరణలను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని భాజపాతో పాటు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో 4గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు కౌంటరు దాఖలు చేశారు. నిందితులకు భాజపా నేతలకు మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణతో పాటు పలువురు పెద్దలతో దిగిన ఫొటోలను జతపర్చారు. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు.

ఇప్పటికే కోర్టుకు క్షమాపణలు చెప్పాం..

ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం తీవ్రమైన నేరమని, ఈ కేసును ఎంతో వేగంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐపీఎస్‌లు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తారని, దేశంలో ఎక్కడైనా పనిచేసే ఐపీఎస్‌లు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గే అవసరం లేదన్నారు. సిట్‌ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో కొనసాగుతోందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని దవే అన్నారు. ఫామ్‌ హౌజ్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న దృశ్యాలు, సంభాషణలకు సంబంధించిన దృశ్యాలను హైకోర్టు సీజేకు పంపడం తప్పేనని, ఈ విషయంలో ఇప్పటికే కోర్టుకు క్షమాపణలు చెప్పామన్నారు. కానీ, ఓ బాధ్యతగల పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందని.. అందుకే మీడియా సమావేశంలో ప్రదర్శించారని దవే హైకోర్టుకు వివరించారు.

పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారు: మహేశ్‌ జెఠ్మలానీ

అంతకుముందు భాజపా తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయమవాది మహేశ్‌ జెఠ్మలానీ.. ఏ కేసులోనైనా దర్యాప్తు పారదర్శకంగా, నిజాయితీగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారని వాదించారు. కీలక సమాచారం మీడియాకు లీక్‌ చేస్తున్నారని, రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు.  కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. తుషార్ కు 41ఏ నోటీసులు, లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేయడంపైనా ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నోటీసులపై స్టే ఇవ్వాలని కోరారు. సిట్ అధికారుల దర్యాప్తునకు సహకరించాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ పై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని