logo

‘హిల్స్‌’ ఠాణాలకు అదనపు బలగాలు

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ఠాణాల పరిధిలో కొద్ది కాలంగా వరుసగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్త సంఘటనల నేపథ్యంలో పోలీసులకు బందోబస్తు ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి..

Published : 01 Dec 2022 02:37 IST

అవకాశాలను పరిశీలించిన అదనపు కమిషనర్‌

జూబ్లీహిల్స్‌ స్టేషన్‌కు వచ్చిన విక్రమ్‌ సింఘ్‌ మాన్‌, చిత్రంలో జోయల్‌ డేవిస్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ఠాణాల పరిధిలో కొద్ది కాలంగా వరుసగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్త సంఘటనల నేపథ్యంలో పోలీసులకు బందోబస్తు ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి.. ఒక్కో సందర్భంలో ఠాణాలో అధికారులు అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంటోంది.. ఉదయం నుంచి రాత్రి వరకు బందోబస్తులకే పరిమితమవుతుండటంతో పౌర సేవల విషయంలో జాప్యం చోటుచేసుకుంటోంది..ఈ నేపథ్యంలోనే ఈ రెండు ఠాణాలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.. ఒత్తిడిని తగ్గించేందుకు అదనపు బలగాలు అందించే యోచన చేస్తున్నారు.

ఏటా 1200కుపైగా కేసులు

భాజపా ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ముట్టడి, జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం, బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల సంఘటన, కృష్ణ సతీమణి మృతి, కృష్ణ మృతి, తాజాగా షర్మిల నివాసం వద్ద ఉద్రిక్తత.. ఇలా వరుస సంఘటనల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తులకే అత్యధిక సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏటా ఈ రెండు పోలీసు ఠాణాల్లో దాదాపుగా 1200కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతుంటాయి. చాలా మంది పోలీసు అధికారులు, సిబ్బంది రాత్రి విధులు నిర్వర్తించినా తిరిగి ఉదయం విధులకు సైతం హాజరు కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే బుధవారం నగర అదనపు కమిషనర్‌(శాంతిభద్రతల విభాగం) విక్రమ్‌సింఘ్‌ మాన్‌ జూబ్లీహిల్స్‌ ఠాణాను సందర్శించారు. ఇక్కడున్న పరిస్థితులపై పశ్చిమ మండల డీసీపీ జోయల్‌ డేవిస్‌, బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌లను అడిగి వివరాలు సేకరించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ ఠాణాలో 160మందికిపైగా బంజారాహిల్స్‌లో 180 మందికిపైగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఠాణాలకు అదనంగా ఒక్కో ప్లటూన్‌ ఏర్పాటుచేయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ఠాణాల్లో కావాల్సిన వసతిని, స్థలాన్ని అందించే విషయమై పరిశీలించారు. దాదాపు 25 మందికిపైగా ఈ ప్లటూన్‌లో ఉంటారు. బందోబస్తు సమయంలో, ప్రముఖుల ప్రయాణ సమయంలో రహదారిపై బందోబస్తు కోసం, ఏదైనా ఘటన జరిగిన సమయంలోనూ వీరిని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని