logo

రాష్ట్రంలో 1.5 లక్షల మంది హెచ్‌ఐవీ రోగులు

రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌ రోగులు ఉన్నారు. వీరిలో 90 వేల మంది మాత్రమే మందులు తీసుకుంటున్నారు.

Updated : 01 Dec 2022 06:31 IST

తెలంగాణలో తగ్గిన కేసులు

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌ రోగులు ఉన్నారు. వీరిలో 90 వేల మంది మాత్రమే మందులు తీసుకుంటున్నారు. మిగతావారు ఎక్కడ ఉన్నారనే విషయం తెలంగాణ ఎయిడ్స్‌ నియంత్రణ అధికారులకే తెలియదు. వీరిలో ఎక్కువ శాతం గ్రామీణులే. అందులోనూ డ్రైవర్లు, మెకానిక్‌లు, కార్మికులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థుల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశం. 2015లో 0.66 శాతం బాధితులు నమోదు కాగా, 2020-21లో 0.47 శాతానికి తగ్గిందని అధికారులు వెల్లడించారు. బుధవారం కోఠిలోని రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ప్రాజెక్టు అదనపు సంచాలకురాలు డా.జి.అనంత ప్రసన్నకుమారి, ఉప సంచాలకులు జి.వెంకటేశ్వర్‌రెడ్డి, సంయుక్త సంచాలకులు డాక్టర్లు మురళీధర్‌, రవికుమార్‌, పరిపాలనా విభాగాధికారి ప్రవీణ్‌కుమార్‌ ప్రపంచ ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూలన కోసం రూపొందించిన గోడప్రతులను ఆవిష్కరించారు. డా.జి.అనంత ప్రసన్నకుమారి మాట్లాడుతూ.. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ నగరంలోని మెట్రో స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, సాంకేతిక వృత్తివిద్యా కళాశాలలు, ఐటీ, సినీ పరిశ్రమల్లో స్క్రీనింగ్‌ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు కౌన్సెలింగ్‌తో పాటు జీవితకాలం మందులు అందజేస్తామన్నారు. అవసరమైతే ఆన్‌లైన్‌లోనూ స్వయం నిర్ధారణ కిట్లు పంపిణీ చేస్తామన్నారు.  లింగమార్పిడి చేయించుకునేవారి కోసం ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఆపరేషన్‌ థియేటర్‌, సిబ్బందిని నియమించుకునేందుకు సర్కారు అనుమతిచ్చిందని, మరో 5 నెలల్లో సేవలు ప్రారంభిస్తామన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు