logo

Tiffa scan: సీమంతం కాదు.. ముందు టిఫా

పేట్లబుర్జు ప్రసూతి ఆసుపత్రిలో జనవరి నుంచి ఇప్పటివరకు 30 మంది గర్భిణులకు 5 నెలలు నిండిన తర్వాత గర్భస్రావం చేశారు.

Updated : 01 Dec 2022 12:06 IST

లేదంటే ఆనందం కళ్లముందే ఆవిరి

తప్పని పరిస్థితిలో గర్భ విచ్ఛిత్తి

ఈనాడు, హైదరాబాద్‌

పేట్లబుర్జు ఆసుపత్రిలో యంత్రం

పేట్లబుర్జు ప్రసూతి ఆసుపత్రిలో జనవరి నుంచి ఇప్పటివరకు 30 మంది గర్భిణులకు 5 నెలలు నిండిన తర్వాత గర్భస్రావం చేశారు. పుట్టబోయే శిశువులో అవయవ లోపాలు ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితిలో వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వీళ్లంతా తమకు పుట్టబోయే బిడ్డను తలచుకొని ఆనందంతో సీమంతం వేడుక జరుపుకొనే వారే. తీరా 5 నెలల తర్వాత చేసిన టిఫా స్కానింగ్‌లో... బిడ్డలో లోపాలు బయటపడటంతో గర్భవిచ్ఛిత్తి తప్పనిసరి అవుతోంది.

గ్రేటర్‌ వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన టిఫా(టార్గెటెడ్‌ ఇమాజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనోమాలిస్‌) అందుబాటులోకి రావడంతో, ఇకపై ఇలాంటి సమస్యలకు ముందే అడ్డుకట్ట వేయవచ్చు. చాలా ఇళ్లల్లో గర్భిణులకు 5వ నెలలో ఘనంగా సీమంతం వేడుక నిర్వహిస్తుంటారు. తర్వాత... శిశువులో లోపాలు బయటపడితే అప్పుడు గర్భ విచ్ఛిత్తి చేయాల్సి ఉంటుంది. అవగాహన లేక కొందరు... ఈ పరీక్ష అందుబాటులో లేక మరికొందరు టిఫా స్కానింగ్‌లకు దూరంగా ఉండిపోతున్నారు. తర్వాత ఏదైనా సమస్యతో ఆసుపత్రులకు వచ్చినప్పుడు, వైద్యులు ఈ పరీక్షలు చేయిస్తున్నారు.  కొందరిలో లోపాలు బయట పడుతున్నాయి.  చేసేది లేక గర్భిణులను, కుటుంబ సభ్యులను ఒప్పించి గర్భ విచ్ఛిత్తి చేయాల్సి వస్తోంది. ప్రైవేటులో రూ.3-4 వేలు ఖర్చయ్యే ఈ పరీక్షలు.. ఇక నుంచి ఉచితంగా నిర్వహించనున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 చోట్ల అందుబాటులోకి తెచ్చారు. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే పది ఆసుపత్రుల్లో  షురూ అయ్యాయి. తల్లి గర్భంలో ఉన్న శిశువు శిరస్సు నుంచి పాదం వరకు శరీర భాగాల్లో, అంతర్గత అవయవాల్లో లోపాలు ఈ స్కానింగ్‌లో బయట పడతాయి.

ఈ సౌకర్యం ఉన్న ఆసుపత్రులు..

గాంధీ, నిలోఫర్‌, సుల్తాన్‌బజార్‌, పేట్లబుర్జు, మలక్‌పేట, నాంపల్లి, కింగ్‌కోఠి, ఘట్‌కేసర్‌ కమ్యూనిటీ సెంటర్‌, కొండాపూర్‌ జిల్లా ఆసుపత్రి, వనస్థలిపురం జిల్లా ఆసుపత్రి.


తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి...

డాక్టర్‌ మాలతి, సూపరింటెండెంట్‌, పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి

చాలామంది సీమంతం తర్వాత స్కానింగ్‌ కోసం వస్తుంటారు.  లోపాలు బయట పడితే ఆవేదన చెందుతుంటారు. పేట్లబుర్జులో ఇలాంటి కేసులు చాలా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో అయిదో నెలలో  సీమంతం వాయిదా వేసుకోవడం మంచిది. 6వ నెల ప్రారంభం తర్వాత తప్పనిసరిగా టిఫా స్కానింగ్‌ చేయించుకోవాలి. ఎలాంటి లోపాలు లేవని తేలితే.. అప్పుడు సంతోషంగా ఈ వేడుక చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని