logo

అఫ్గానిస్థాన్‌ టు హైదరాబాద్‌ వయా రాజస్థాన్‌

నోట్లో వేసుకుంటే మత్తెక్కించే నిషేధిత పాపీ స్ట్రా పౌడర్‌(గసగసాల గడ్డి నుంచి తయారుచేసే మత్తు మందు), ఓపీయం(నల్ల మందు)ను హైదరాబాద్‌కు చేరవేస్తున్న ఘరానా నేరగాడు మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ, నేరేడ్‌మెట్‌ పోలీసులకు చిక్కాడు.

Published : 01 Dec 2022 02:37 IST

12 లక్షల విలువైన నిషేధిత ఓపీయం, పాపీ స్ట్రా పౌడర్‌ స్వాధీనం

ఈనాడు, హైదరాబాద్‌: నోట్లో వేసుకుంటే మత్తెక్కించే నిషేధిత పాపీ స్ట్రా పౌడర్‌(గసగసాల గడ్డి నుంచి తయారుచేసే మత్తు మందు), ఓపీయం(నల్ల మందు)ను హైదరాబాద్‌కు చేరవేస్తున్న ఘరానా నేరగాడు మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ, నేరేడ్‌మెట్‌ పోలీసులకు చిక్కాడు. అఫ్గానిస్థాన్‌లో పండించే ఈ మత్తుమందు సరిహద్దుల గుండా అక్రమంగా రాజస్థాన్‌కు చేరుతోంది. లారీలు, ట్రక్కుల ద్వారా నగరానికి తీసుకొస్తున్న నిందితుడు.. అతని నుంచి కొనుగోలు చేస్తున్న ముగ్గుర్ని మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. రూ.12.5 లక్షల విలువైన 750 గ్రాముల ఓపీయం, అరకిలో పాపీ స్ట్రా పౌడర్‌, ఇన్నోవా కారు, బైకు, రూ.65 వేలు, ఐదు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ బుధవారం విలేకర్లకు వెల్లడించారు.

తరచూ రవాణా చేస్తూ..: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన రమేశ్‌ బిష్ణోయ్‌ అలియాస్‌ శశిపాల్‌(30) ఐదు నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చి బీఆర్‌ ట్రావెల్స్‌లో పనిచేస్తూ జీడిమెట్లలో ఉంటున్నాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్‌ సరఫరాదారుగా అవతారమెత్తాడు. అఫ్గానిస్థాన్‌ నుంచి అక్రమంగా జోధ్‌పూర్‌కు చేరే పాపీస్ట్రా పౌడర్‌, ఓపీయంను తక్కువ ధరకు కొని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు ట్రక్కులు, లారీల్లో రహస్యంగా తీసుకొచ్చి విక్రయించేవాడు. పది రోజుల క్రితం రాజస్థాన్‌కు వెళ్లిన అతను అరకిలో పాపీ స్ట్రా పౌడర్‌, 750 గ్రాముల ఓపీయం కొని.. నగరానికి వచ్చాడు. నేరేడ్‌మెట్‌లో ఉండే వ్యాపారి, రాజస్థాన్‌కు చెందిన విష్ణు బిష్ణోయ్‌(32)కు విక్రయించేందుకు మంగళవారం గణేశ్‌నగర్‌లోని సునీల్‌ స్టీల్‌ రెయిలింగ్‌, ఫర్నిచర్‌ దుకాణానికి వెళ్లాడు. ఎస్‌వోటీ మల్కాజ్‌గిరి పోలీసులు వారిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. సరకు కొనుగోలు చేసే గాజులరామారం నివాసి సునీల్‌ దంగా(26), సుచిత్రకు చెందిన అర్జున్‌రామ్‌(33)ను ఆర్కేపురం లో అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టులో కీలకంగా వ్యవహరించిన మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ సీఐ రాములు, నేరేడ్‌మెట్‌ సీఐ నరసింహస్వామిని కమిషనర్‌ అభినందించి రివార్డు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని