logo

ప్లాట్లు చేసి.. రూ. కోట్లు మేసి

ప్రజాప్రతినిధుల పేరును అడ్డం పెట్టుకుంటారు.. అనుచరులుగా చలామణీ అవుతూ ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తారు.. పేదలకు అంటగట్టి.. రూ.లక్షల్లో వసూలు చేస్తుంటారు.

Published : 02 Dec 2022 02:26 IST

గాజులరామారం ప్రభుత్వ భూముల్లో నేతల కబ్జాపర్వం
80 గజాల స్థలానికి రూ.10-12 లక్షలు వసూలు
ఈనాడు, హైదరాబాద్‌

టీఎస్‌ఐఐసీకి కేటాయించిన స్థలంలో నిర్మాణాలు

ప్రజాప్రతినిధుల పేరును అడ్డం పెట్టుకుంటారు.. అనుచరులుగా చలామణీ అవుతూ ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తారు.. పేదలకు అంటగట్టి.. రూ.లక్షల్లో వసూలు చేస్తుంటారు. నగర శివారులోని కుత్బుల్లాపూర్‌ మండలంలోని కొందరు చోటా మోటా నాయకులు సాగిస్తున్న భూ దందా ఇది. ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. ప్రభుత్వ భూములు ప్లాట్లు చేసి విక్రయిస్తున్న వ్యవహారం వెలుగుచూసింది.

నగర శివారులో గాజులరామారంలో సర్వే నం.79లో 461.28 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ హయాంలో 2007లో రాజీవ్‌ గృహకల్పకు 23.24 ఎకరాలు కేటాయించారు. 2009లో రాజీవ్‌ స్వగృహకు 29.16 ఎకరాలు కేటాయించారు.  మిగిలిన భూమి ఖాళీగా ఉండటంతో ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఏళ్ల తరబడిగా హౌసింగ్‌ బోర్డు అధికారులు పట్టించుకోకపోవడంతో ఎకరా కూడా ఖాళీ లేకుండా కబ్జాలు జరిగాయి.

మేం ఉన్నాం.. ఆక్రమించుకోండి

ఈ ఆక్రమణల వెనుక స్థానికంగా నేతలుగా చలామణీలో ఉన్న వారే ఉన్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండదండలు తోడయ్యాయి.  రాజీవ్‌ స్వగృహ ఇళ్ల నిర్మాణాల వద్ద ఇద్దరు నాయకులు దందా సాగిస్తున్నారు. ఇళ్లు లేని వ్యక్తుల నుంచి రూ.5-10లక్షలు వసూలు చేసి 80గజాల చొప్పున ప్లాట్లు చేసి కేటాయిస్తున్నారు. రాత్రికిరాత్రే  ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు సమాచారం తెలిసి కూలగొట్టేందుకు ప్రయత్నించినా.. ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు చేయించి ఒత్తిడి తీసుకువస్తున్నారు. చివరకు తూతూమంత్రంగా  కూలగొట్టి  వదిలేస్తున్నారు. చివరకు భూములు దక్కించుకున్న సంస్థల అధికారులు సైతం నాయకులతో చేతులు కలపడంతో కబ్జారాయుళ్లు దండుకుంటున్నారు.

హద్దుల్లేకుండా చేసి..

ప్రభుత్వ భూమికి హద్దులు గుర్తించేలా ఎక్కడా మార్కింగ్‌ లేవు. ఇది సదరు నాయకులకు వరంగా మారింది. రాజీవ్‌ స్వగౄహ ఇళ్ల పక్కనే టీఎస్‌ఐఐసీకి 250 ఎకరాలు కేటాయించారు. ఈ స్థలం చుట్టూ కంచె వేసే విషయంలో అధికారుల్లో చలనం లేకుండాపోయింది. ఒకవైపు టీఎస్‌ఐఐసీకి చెందిన స్థలం అని బోర్డులు ఉన్నా.. ప్లాట్లు చేసి విక్రయాలు చేపట్టడంతో స్థానిక నాయకుల చేతుల్లో ఫలహారం అవుతోంది.

ఇంటి నంబర్లు.. విద్యుత్తు కనెక్షన్లు..

ప్రభుత్వ భూమిలో ఇళ్లకు స్థానిక నాయకులే  అనధికారికంగా నంబర్లు కేటాయిస్తున్నారు.  విద్యుత్తు కనెక్షన్లు కూడా జారీ అవుతున్నాయి. గాజులరామారంలో సర్వే నం.49లో దిల్‌ సంస్థకు కేటాయించిన భూముల్లో ఓ నాయకుడు చక్రం తిప్పుతున్నారు.  ‘ఈనాడు’ ప్రతినిధులు అక్కడికి వెళ్లినప్పుడు 80 గజాల స్థలం రూ.10-12 లక్షల మధ్య విక్రయిస్తున్నట్లు తేలింది.  రేకుల షెడ్డు  కట్టుకుని ఉండేందుకు వీలవు తుందంటూ స్థానికుడొకరు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని