logo

చర్చిస్తారా.. వదిలేస్తారా..!

నిధుల కొరతతో జిల్లాలో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. జిల్లాకు రావాల్సిన వాటా నిధులు రూ.11 కోట్లు కేటాయింపులో తీవ్ర జాప్యం కావడంతో నిరీక్షణ తప్పడం లేదు.

Published : 02 Dec 2022 02:26 IST

నిలిచిన రూ.11 కోట్లు..సాగని పనులు

నేడు జిల్లా పరిషత్‌ సమావేశం
న్యూస్‌టుడే, వికారాబాద్‌

నిధుల కొరతతో జిల్లాలో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. జిల్లాకు రావాల్సిన వాటా నిధులు రూ.11 కోట్లు కేటాయింపులో తీవ్ర జాప్యం కావడంతో నిరీక్షణ తప్పడం లేదు. కనీసం నేడు జరగనున్న జిల్లా పరిషత్‌ సమావేశంలోనైనా నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

2019లో ఏర్పడినా...:

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 33 మండలాలు ఉండగా, ఉమ్మడి జిల్లా నుంచి 15 మండలాలు, మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 3 మండలాలను విలీనం చేసి 18 మండలాలతో వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ 5 జులై 2019లో నూతనంగా అవతరించింది. ఆ తరుణంలో వికారాబాద్‌ జిల్లా పరిషత్‌కు రూ.58 కోట్లు రావాల్సి ఉండగా, రూ.47 కోట్లు వచ్చాయి. అప్పటి నుంచి నిధుల కోసం ప్రభుత్వానికి, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ సీఈఓకు పలుమార్లు వినతిపత్రం సమర్పించినా ఫలితం లేకపోయింది.

కేటాయింపులో నిర్లక్ష్యం..:

మహబూబ్నగర్‌ జిల్లా నుంచి 7 మండలాలు రంగారెడ్డి జిల్లాలో, 3 మండలాలు వికారాబాద్‌లో కలిపారు. ఈ 10 మండలాలకు జనాభా ప్రాతిపదికన కేటాయించాల్సిన రూ.5.2 కోట్లను మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ నుంచి జాప్యం లేకుండా అప్పట్లోనే రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లా పరిషత్‌లకు బదిలీ చేశారు. వికారాబాద్‌ జిల్లాకు ఇంకా రావాల్సిన రూ.11 కోట్ల కేటాయింపులో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటంతో జిల్లా అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం పడుతోంది.

మంత్రి హామీ ఇచ్చినా..

మూడు మాసాల కిందట జరిగిన జిల్లా పరిషత్‌ సమావేశం ప్రారంభంలోనే జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌ రంగారెడ్డి జిల్లా పరిషత్‌ నుంచి రావాల్సిన రూ.11 కోట్ల బకాయిల విషయమై ప్రస్తావించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి వచ్చే సమావేశం నాటికి నిధుల బదలాయింపు జరిగేలా చర్యలు తీసుకుంటానని బదులిచ్చారు. ఇప్పటి వరకు వాటి ఊసే లేదు. జిల్లాలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డితో పాటు వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌లోని 18 జడ్పీటీసీ స్థానాలకు 17 మంది అధికార తెరాసలోనే కొనసాగుతున్నారు.


ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం..
- సునీతారెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు, వికారాబాద్‌

వికారాబాద్‌ జిల్లా పరిషత్‌కు రావాల్సిన నిధుల విషయమై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ సీఈఓకు లేఖలు కూడా రాశాం. నిధులు కేటాయింపు జరగక పోవడంతో అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోంది. అందరి చొరవతో నిధులను తీసుకొచ్చేలా కృషి చేస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని