logo

ప్రశ్నిస్తే తెలిసింది.. నిందితుడని..

ఎన్నెపల్లికి చెందిన ఎం.డి.సల్మాన్‌ అనే 24 ఏళ్ల యువకుడు రాత్రిపూట వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో చేతిలో ప్లాస్టిక్‌ కవర్‌ పట్టుకొని అటు ఇటు తిరుగుతుండగా, గస్తీ నిర్వహిస్తున్న వికారాబాద్‌ ఎస్‌ఐ సత్యనారాయణ ప్రశ్నించారు.

Published : 02 Dec 2022 02:24 IST

రెండు దారుణ హత్యలకు పాల్పడిన యువకుడి అరెస్టు

హత్యకు గురైన కల్యాణ్‌బాబు, సురేష్‌

వికారాబాద్‌, న్యూస్‌టుడే: ఎన్నెపల్లికి చెందిన ఎం.డి.సల్మాన్‌ అనే 24 ఏళ్ల యువకుడు రాత్రిపూట వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో చేతిలో ప్లాస్టిక్‌ కవర్‌ పట్టుకొని అటు ఇటు తిరుగుతుండగా, గస్తీ నిర్వహిస్తున్న వికారాబాద్‌ ఎస్‌ఐ సత్యనారాయణ ప్రశ్నించారు. పోలీసులను చూడగానే ఒకింత కలవరానికి గురయ్యాడు. అనుమానంతో పోలీసులు ప్లాస్టిక్‌ కవర్‌లో గంజాయిని గుర్తించారు. అదుపులోకి తీసుకొని పోలీస్‌ఠాణాకు తరలించి విచారించగా, గతంలో చేసిన రెండు హత్యల తాలూకూ వివరాలు బహిర్గతమయ్యాయి. గురువారం వికారాబాద్‌ పోలీస్‌ఠాణా ఆవరణలో జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు.

తన ప్రియిరాలితో కలిసి ఉంటున్నాడని..

తాను ప్రేమించిన యువతితో అక్రమ సంబంధం పెటుకున్నాడని రంగారెడ్డిజిల్లా శంకర్‌పల్లి పట్టణం సాయినగర్‌ కాలనీకి చెందిన కల్యాణ్‌బాబు(19) అనే యువకుడిని ఇతను చంపేశాడు. అతనితో స్నేహం చేసి 10 డిసెంబరు 2019లో వికారాబాద్‌కు తీసుకు వచ్చాడు. శివారెడ్డిపేట శివారులో ఓ బావి దగ్గర ఇద్దరు కలిసి గంజాయి, మద్యం తాగారు. మైకంలో ఉన్న కల్యాణ్‌బాబును బావిలోకి తోసి హత్య చేశాడు.

గంజాయి వ్యాపారంలో మోసం ...

నేపాల్‌కు చెందిన సురేష్‌ వికారాబాద్‌ పట్టణంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పని చేసేవాడు. సల్మాన్‌తో పరిచయం ఏర్పడగా, నేపాల్‌ నుంచి నిషేధిత గంజాయి తెప్పించి ఇస్తానని ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో సల్మాన్‌ను కొట్టడంతో హత్యకు పథకం వేశాడు. సురేష్‌తో చెలిమి చేసి 2021 ఏప్రిల్‌ మొదటి వారంలో వికారాబాద్‌ పట్టణ శివారులోని మద్దులగడ్డతండా అటవీ ప్రాంతంలో ఓ గుట్ట దగ్గరికి తీసుకెళ్లి ఇద్దరు కలిసి గంజాయి, మద్యం సేవించిన తరువాత మైకంలో ఉన్న సురేష్‌పై ముందుగానే దాచి ఉంచుకున్న ఇనుప గొట్టం(పైపు)తో తలపై బలంగా మోది హత్య చేశాడు. ఈ రెండు హత్యలకు పాల్పడిన నిందితుడు సల్మాన్‌ హైదరాబాద్‌ బేగంపేటలోని ఓ చికెన్‌ సెంటర్‌లో పని చేస్తూ ఓ అమ్మాయిని వేధింపులకు గురి చేయగా, కేసు నమోదు కాగా, అక్కడి నుంచి తప్పించుకొని వికారాబాద్‌కు వచ్చి కొన్ని ప్రాంతాల్లో గంజాయి విక్రయించేవాడని విచారణలో తేలినట్లు వివరించారు. ఈ కేసుల్లో సమర్థంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో వికారాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ శ్రీను పాల్గొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని