logo

‘రేషన్‌’తో కాసులు.. మైనర్లే పావులు

రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందా ముఠాలు నగరంలో పేట్రేగిపోతున్నాయి. మైనర్లను పావులుగా వాడుకుంటూ రేషన్‌ దుకాణాల ముందే కొనుగోళ్లకు పాల్పడుతున్నారు.

Published : 02 Dec 2022 02:24 IST

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, అమీర్‌పేట్‌: రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందా ముఠాలు నగరంలో పేట్రేగిపోతున్నాయి. మైనర్లను పావులుగా వాడుకుంటూ రేషన్‌ దుకాణాల ముందే కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. ఇలా లబ్ధిదారులు బియ్యం తీసుకోగానే.. పక్కనే కాంటాలు పెట్టుకుని తిష్ఠ వేస్తుండటం గమనార్హం. బోరబండ రైల్వేట్రాక్‌ సమీపంలో రాజీవ్‌గాంధీనగర్‌ మురికివాడ కేంద్రంగానే ఈ దందా నగరమంతా విస్తరించినట్లు సమాచారం. ఇక్కడి మురికివాడల్లోని టీనేజీ పిల్లలను బియ్యం సేకరణకు పంపుతున్నారు. ఇందుకు నంబర్‌ ప్లేట్‌ లేని ద్విచక్ర వాహనాలను వినియోగిస్తుండటం గమనార్హం. వీరంతా  రెండుమూడు సంచులు, కాంటాలతో రహ్మత్‌నగర్‌, బోరబండ, సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌, సనత్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌, ఇతర మురికివాడలకు వెళ్తున్నారు. లబ్ధిదారులు బియ్యం కొనగానే.. వారినుంచి కిలో రూ.8 నుంచి రూ.10చొప్పున కొంటున్నారు. ఇలా ఒక్కో దుకాణం వద్ద దాదాపు 10 క్వింటాళ్లు సేకరిస్తున్నారు. ఈ దందా మొత్తానికి రాజీవ్‌గాంధీనగర్‌ మురికివాడలో ఉండే ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నారు. మైనర్లకు కేజీకి కొంత కమీషన్‌ ఇస్తానంటూ దందాలో దింపుతున్నాడు.

మా బాస్‌ చూసుకుంటాడు..

ఇలా సేకరించిన బియ్యాన్ని మరో వ్యక్తి శివార్లలో గోదాములకు తరలిస్తున్నాడు. బస్తీల పెద్దలు వీరిని ప్రశ్నించి, పోలీసులకు ఫిర్యాదుచేస్తామంటే.. ‘ఏమైనా చేసుకోండి, అంతా మాబాస్‌ చూసుకుంటాడంటూ’ వెళ్లిపోతున్నారు. సరూర్‌నగర్‌ పరిధి బస్తీపెద్దలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది హైదరాబాద్‌ జిల్లాలో అధికారుల తనిఖీల్లో 3.5లక్షలు, రంగారెడ్డిలో 4లక్షలు, మేడ్చల్‌ జిల్లాలో 3.5లక్షల కేజీల బియ్యం స్వాధీనంచేసుకున్నారు. ఇది అక్రమంగా తరలుతున్న రేషన్‌లో 10శాతం కూడా కాదన్నది ప్రధాన ఆరోపణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని