logo

విషవాయువు..వాహన ఇంధనమవుతోంది

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు నుంచి రోజూ దాదాపు 5 టన్నుల బయో-సీఎన్‌జీ ఉత్పత్తి అవుతోంది. దాంతో వాతావరణ కాలుష్య తీవ్రత తగ్గుముఖం పడుతోంది.

Published : 03 Dec 2022 03:52 IST

జవహర్‌నగర్‌ యార్డులోని గ్యాస్‌ ప్లాంటు

ఈనాడు, హైదరాబాద్‌: జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు నుంచి రోజూ దాదాపు 5 టన్నుల బయో-సీఎన్‌జీ ఉత్పత్తి అవుతోంది. దాంతో వాతావరణ కాలుష్య తీవ్రత తగ్గుముఖం పడుతోంది.

127 ఎకరాల్లో సేకరణ..కాప్రా మండలం జవహర్‌నగర్‌లో దాదాపు 350 ఎకరాల్లో విస్తరించిన యార్డును జీహెచ్‌ఎంసీ ప్రైవేటు నిర్వహణకు ఇచ్చింది. రీ సస్టైనబులిటీ సంస్థ వ్యర్థాల నిర్వహణ చేపడుతోంది. దశాబ్దాల నాటి 1.3 కోట్ల టన్నుల చెత్తను 127 ఎకరాల్లో కుప్పగా పోసింది. అలాగే వదిలేస్తే.. మిథేన్‌ అనే విషవాయువు విడుదలై సమీప గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ రూ.144 కోట్లతో చెత్తకుప్పలపై ఒకటిన్నర అడుగు మేర మట్టి, పైన దళసరి ప్లాస్టిక్‌ కవర్లను మూడు పొరలుగా కప్పింది. చివరగా మట్టిపై పచ్చదనం పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను క్యాపింగ్‌ అంటారు. ఈ క్రమంలో.. చెత్తకుప్పలపై 150 బోరు బావులు తవ్వారు. వాటిలోకి జాలీ లాంటి పైపులు దింపారు. అన్ని పైపులను యార్డులో ఏర్పాటు చేసిన గ్యాస్‌ తయారీ కేంద్రానికి అనుసంధానం చేశారు.

తయారీ ఇలా..చెత్తకుప్పల్లోంచి విడుదలయ్యే మిథేన్‌ను ట్యాంకుల్లో నింపుతున్నారు. సహజంగా ఇలా వెలువడే వాయువులో మిథేన్‌ 40-50 శాతం ఉంటుంది. మిగిలిన సగంలో కార్బన్‌డయాక్సైడ్‌, నైట్రోజన్‌, ఆక్సిజన్‌, అమ్మోనియా, సల్ఫైడ్స్‌, హైడ్రోజన్‌ ఇతరత్రా వాయువులుంటాయి. శుద్ధి ప్రక్రియ ద్వారా మిథేన్‌ 93-94 శాతానికి పెరిగి నాణ్యమైన సీఎన్‌జీగా మారుతుంది. అలా ఉత్పత్తయ్యే ఈ బయో సీఎన్‌జీ వాహనాలకు ఇంధనంగా ఉపయోగపడుతోంది. ఒప్పందం ప్రకారం భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ సంస్థకు రోజూ 2 టన్నుల గ్యాస్‌ను విక్రయిస్తున్నారు. మిగిలిన దానిని యార్డు అంతర్గత అవసరాలకు ఉపయోగిస్తున్నామని నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఒకటిన్నర టన్ను గ్యాస్‌తో రోజూ ఇక్కడకు చెత్త తీసుకొచ్చే 100 ట్రక్కులను నడిపించేందుకు ప్రణాళిక సిద్దంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని