logo

అమ్మకు బై చెప్పి..అనంతలోకాలకు చేరి

అమ్మ చేతి గోరు ముద్దలు తిని.. బై అని చెప్పి అన్నతో కలిసి నాన్నమ్మ చేయి పట్టుకుని పాఠశాలకు బయలుదేరిన చిన్నారి లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి బలయ్యాడు

Published : 03 Dec 2022 03:52 IST

బాలుణ్ని బలిగొన్న టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం

రుత్విక్‌

చేవెళ్ల గ్రామీణం: అమ్మ చేతి గోరు ముద్దలు తిని.. బై అని చెప్పి అన్నతో కలిసి నాన్నమ్మ చేయి పట్టుకుని పాఠశాలకు బయలుదేరిన చిన్నారి లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి బలయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గొల్లపల్లిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లికి చెందిన రాజు, శశికళ దంపతులకు అభిలాష్‌గౌడ్‌, రుత్విక్‌గౌడ్‌(7) ఉన్నారు. వారిని చేవెళ్లలోని కృష్ణవేణి పాఠశాలలో చదివిస్తున్నారు. తల్లి శుక్రవారం ఇద్దరు కుమారులను తయారు చేసి వారి నాన్నమ్మ యాదమ్మతో పాఠశాల బస్సు ఎక్కించేందుకు పంపించింది. ఆమె మనవళ్లతో రోడ్డు పక్కన నిల్చొని ఉండగా చేవెళ్ల నుంచి శంకర్‌పల్లి వైపు వెళ్తున్న టిప్పర్‌ డ్రైవర్‌ అతివేగంగా నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పి స్టీరింగ్‌ను ఎడమ వైపు తిప్పాడు. కల్వర్టును తాకి రోడ్డు పక్కన ఉన్న రుత్విక్‌గౌడ్‌ని, చెట్టును ఢీకొట్టి ముందుకు దూసుకుపోయింది. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా యాదమ్మ పక్కకు పడిపోవడంతో నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. అభిలాష్‌ పక్కనున్న పొదలో పడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కొద్ది క్షణాల ముందు ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు దుర్మరణం పాలవడంతో తల్లితండ్రులు బోరున విలపించారు. డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. గ్రామ శివారులో రోడ్డు మలుపు ఉందని అక్కడ స్పీడ్‌ బ్రేకర్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులునాలుగు గంటలపాటు రోడ్డుపై ఆందోళన చేశారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం వచ్చి గ్రామస్థులకు సర్దిచెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని