logo

కాల్పులు ఇరానీ గ్యాంగ్‌ పనే..!

‘ఆభరణాల దుకాణంలో కాల్పులు, బంగారం దోపిడీ’’ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇరానీ గ్యాంగ్‌ సభ్యుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

Published : 03 Dec 2022 03:52 IST

స్నేహపురి కాలనీ దోపిడీ నిందితులపై పోలీసుల అనుమానం
మూడు కిలోల బంగారం దోచుకెళ్లినట్లు ఫిర్యాదు.. కేసు నమోదు

సంఘటన జరిగిన బంగారు నగల దుకాణం

ఈనాడు- హైదరాబాద్‌: ‘ఆభరణాల దుకాణంలో కాల్పులు, బంగారం దోపిడీ’’ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇరానీ గ్యాంగ్‌ సభ్యుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశవాళీ తుపాకీ వినియోగించడం, దోపిడీకి యత్నించిన తీరు పరిశీలించిన పోలీసులు ఈ అంచనాకొచ్చారు. ఈ నేపథ్యంలో గతంలో దోపిడీకి పాల్పడ్డ ముఠా సభ్యుల నేరచరిత్ర, వివరాలు ఆరా తీస్తున్నారు. వారు ఎక్కడెక్కడ ఉంటున్నారో కూపీ లాగుతున్నారు. నిందితులు ఉపయోగించిన వాహనాలు, అక్కడ వేలిముద్రలు, సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీల ఆధారంగా 15 బృందాలు రంగంలోకి దిగాయి. నిందితులు ద్విచక్రవాహనంపై దుకాణానికి వచ్చి పారిపోయిన నేపథ్యంలో సమీప ప్రాంతాల్లోని వందలాది సీసీ కెమెరాలను ప్రత్యేక బృందాలు శోధిస్తున్నాయి. మరోవైపు క్లూస్‌ టీం అధికారుల పరిశీలన ప్రకారం.. దోపిడీలో ముగ్గురే పాల్గొన్నట్లు గుర్తించారు. రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఆధారాల ద్వారా గుర్తించారు.పక్కా ప్రణాళిక ప్రకారం.. ఈ దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. రాజ్‌కుమార్‌ సురానా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రూ.50 లక్షల విలువైన బంగారం, నగదు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చేశారు. అనంతరం మూడు కిలోల బంగారం కొంత నగదు చోరీ చేసినట్లు చెప్పడంతో.. వాస్తవాలను పరిశీలిస్తున్నారు.

లోపలికి ప్రవేశించగానే కాల్పులు

దోపిడీ ఘటనపై బంగారు వ్యాపారి, ఆభరణాల విక్రేత రాజ్‌కుమార్‌ సురానా చైతన్యపురి పోలీసులకు గురువారం అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌  మోండా మార్కెట్‌లోని గణపతి జ్యుయెలర్స్‌ యజమాని రాజ్‌కుమార్‌ సురానా ఆభరణాల దుకాణాలకు బంగారం విక్రయిస్తాడు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం తన దగ్గర పనిచేసే సుఖ్‌దేవ్‌తో కలిసి మూడు కిలోల బంగారు ఆభరణాల(పుస్తెలు, ఉంగరాలు, చెవికమ్మలు, గొలుసులు వంటివి)ను తీసుకుని ద్విచక్రవాహనంపై నగరంలో వివిధ దుకాణాల్లో విక్రయించేందుకు బయల్దేరారు. మధాహ్నం మూడు గంటల సమయంలో బోడుప్పల్‌లోని దుకాణానికి వెళ్లారు. ఆ తర్వాత పీర్జాదిగూడ, వనస్థలిపురం, ఎన్జీవో కాలనీలోని దుకాణాల్లో వేర్వేరుగా మొత్తం 1.9 కిలోల బంగారు ఆభరణాలను విక్రయించాడు. ఇందుకు దుకాణదారులు దాదాపు రూ.2.8 లక్షలు రాజ్‌కుమార్‌కు ఇచ్చారు. రాత్రి 8.40 గంటల సమయంలో స్నేహపురి కాలనీలోని మహదేవ్‌ జ్యుయెలరీ దుకాణానికి వచ్చాడు. అప్పటికే దుకాణ యజమాని కళ్యాణ్‌ చౌదరి ఇద్దరు వినియోగదారులతో మాట్లాడుతున్నాడు. వినియోగదారులు వెళ్లిపోయాక కళ్యాణ్‌కు రాజ్‌కుమార్‌ కొన్ని ఆభరణాలు చూపిస్తున్న సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించారు. ఒకరు షెట్టర్‌ మూసేయగా.. ఒకతను అకస్మాత్తుగా తుపాకీతో కాల్పులు జరిపాడు. కళ్యాణ్‌ ముఖంపై గాయాలయ్యాయి. సుఖ్‌దేవ్‌కు చెంప, ఎడమ భుజం, కాలుకు గాయాలయ్యాయి. అనంతరం దుండగలు సుఖ్‌దేవ్‌ చేతిలో ఉన్న బంగారం సంచిని లాక్కుని పారిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని