logo

లంచం ఇస్తేనే..ధరణి సమస్యలు పరిష్కరిస్తారా..!

లంచం ఇస్తేనే ధరణి సమస్యలు పరిష్కరిస్తున్నారని, కలెక్టర్‌ తీరుతో ప్రభుత్వం అప్రతిష్ఠపాలవుతోందని జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యులు గళమెత్తారు

Updated : 03 Dec 2022 06:36 IST

జడ్పీ సమావేశంలో సభ్యుల నిలదీత
కలెక్టర్‌ తీరుపై నిరసన గళం

మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, అదనపు పాలనాధికారి

వికారాబాద్‌, న్యూస్‌టుడే: లంచం ఇస్తేనే ధరణి సమస్యలు పరిష్కరిస్తున్నారని, కలెక్టర్‌ తీరుతో ప్రభుత్వం అప్రతిష్ఠపాలవుతోందని జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యులు గళమెత్తారు. శుక్రవారం డీపీఆర్‌సీ భవనంలో అధ్యక్షురాలు సునీతారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు వివిధ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా భూ సమస్యలు పరిష్కారానికి నోచక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బొంరాస్‌పేట జడ్పీటీసీ సభ్యురాలు రేణుదేశాయ్‌ మాట్లాడుతూ.. కలెక్టర్‌ కార్యాలయంలో డబ్బులు చెల్లించి, పైరవీలు చేస్తేనే పనులు జరుగుతున్నాయని, మంత్రి వచ్చినా జడ్పీ సమావేశానికి కలెక్టర్‌ హాజరు కారని, కార్యాలయానికి వెళ్తే కలవరన్నారు. మిగతా సభ్యులు ఆమెకు మద్దతు పలికారు. జడ్పీ ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌, పెద్దేముల్‌ జడ్పీటీసీ ధారాసింగ్‌ మాట్లాడుతూ.. కలెక్టర్‌ నిర్వాకం వల్ల చెడ్డపేరు వస్తోందన్నారు. మంత్రి బదులిస్తూ, గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించి, పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మను ఆదేశించారు.

ఎమ్మెల్యేలు, సభ్యుడి వాగ్వాదం

గ్రామాల్లో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని దౌల్తాబాద్‌ జడ్పీటీసీ మహిపాల్‌ ప్రశ్నించారు. ఇందుకు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, వికారాబాద్‌ ఎమ్మెల్యే   ఆనంద్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి కల్పించుకొని సర్ది చెప్పారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిలో వంద అడుగుల దారి నిర్మించేందుకు నాలుగేళ్లు పడుతుందా అని ప్రశ్నించారు. పనులు మంజూరయ్యాక టెండర్లు పిలిచి ప్రారంభించడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని, మిషన్‌ భగీరథ కింద తండాల్లో నల్లా కనెక్షన్లు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.

బిల్లులు రావడం లేదు..

ఉపాధిహామీ పథకం కింద చేసిన పనులకు బిల్లులు పది నెలలుగా రాలేదని పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, పూడూర్‌ జడ్పీటీసీ మల్లేశం సభలో ప్రస్తావించారు. కూలీలకు నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించడం లేదని, కల్లాలు, వంట గదులు నిర్మిస్తే డబ్బులు చెల్లించడం లేదని కుల్కచర్ల ఎంపీపీ సత్యహరిశ్చందర్‌ ప్రశ్నించారు. సాంకేతిక కారణాలతో బిల్లులు చెల్లించలేకపోతున్నామని డీఆర్‌డీఏ కృష్ణన్‌ బదులిచ్చారు. వికారాబాద్‌- శంకర్‌పల్లి రహదారి పనులు కొనసాగిస్తునే ఉన్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే యాదయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

38 బడుల్లో పనులు పూర్తి..

మన ఊరు- మన బడి కింద ఎంపిక చేసిన 38 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ప్రతి పురపాలక సంఘంలో రెండు బడులను ఎంపిక చేసి పనులు ప్రారంభించాలని డీఈవోను ఆదేశించారు. నిధుల కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని అధ్యక్షురాలు సునీతారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డిప్యూటీ సీఈఓ సుభాషిణి, డీసీసీబీ ఛైర్మన్‌ మనోహర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని