logo

సర్కారు కొలువు.. సాధనతో గెలువు

ప్రభుత్వం గ్రూప్‌-4 ఉద్యోగాల ప్రకటన విడుదల చేయడంతో యువతలో కొత్త ఆశలు చిగురించాయి. సర్కారు కొలువు చేయాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు

Published : 03 Dec 2022 04:25 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌

ప్రభుత్వం గ్రూప్‌-4 ఉద్యోగాల ప్రకటన విడుదల చేయడంతో యువతలో కొత్త ఆశలు చిగురించాయి. సర్కారు కొలువు చేయాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అయితే ఇందుకోసం వారు నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలు తక్కువగా ఉండటంతో, పోటీపడేవారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పట్టుదలతో సిద్ధమైన వారే కలలను సాకారం చేసుకునే అవకాశం ఉంటుంది.  

రెవెన్యూ శాఖలో 38 ఖాళీలు

ఉద్యోగ ప్రకటనల జారీపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆయా శాఖల్లో ఖాళీల సమాచారాన్ని పంపాలంటూ జిల్లా అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కేటగిరీల వారీగా రాష్ట్ర కార్యాలయాలకు సంబంధిత అధికారులు ఖాళీల వివరాలను పంపించారు. తాజాగా విడుదలైన గ్రూప్‌-4 ప్రకటనలో రెవెన్యూ శాఖకు సంబంధించి జిల్లాలో 38 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఇతర శాఖల్లోనూ ఖాళీల భర్తీతో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు దక్కడంతోపాటు ప్రజలకు సత్వర సేవలకు మార్గం సుగమం కానుంది.

గ్రంథాలయంలో సదుపాయాలు

జిల్లా కేంద్రంలో గ్రంథాలయం ఉంది. ఇక్కడ దినపత్రికలతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన సామగ్రిని సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ప్రత్యేక గదిని నిర్మించి చదువుకునేందుకు వసతి కల్పించారు. ప్రతి మండల కేంద్రంలో శాఖా గ్రంథాలయాలున్నాయి. దినపత్రికలు నిత్యం చదవడం వల్ల అన్ని పోటీ పరీక్షల్లో అడిగే జనరల్‌ నాలెడ్జి ప్రశ్నలకు సులువుగా సమాధానాలు ఇచ్చేందుకు వీలుంటుంది. జిల్లా, శాఖా గ్రంథాలయాల్లో మొత్తం 3.5 లక్షల పుస్తకాలున్నాయి. పోటీ పరీక్షలకు సంబంధించినవి జిల్లా గ్రంథాలయంలో 24 వేల వరకు ఉన్నాయి. సివిల్స్‌, గ్రూప్స్‌, కానిస్టేబుల్‌, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలున్నాయి. పాఠకులకు అవసరమైనవి పదిరోజుల్లో అధికారులు తెప్పించి ఇస్తున్నారు.

సన్నద్ధతకు అవకాశాలు ఇలా

జిల్లాలో వికారాబాద్‌, తాండూరులో శిక్షణ సంస్థలు ఉన్నాయి.. తాజాగా గ్రూప్‌-4 ఉద్యోగ ప్రకటన వెలువడటంతో ప్రధాన పట్టణాల్లో ప్రైవేటు శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే వికారాబాద్‌ అంబేడ్కర్‌ భవనం, తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తరగతులు కొనసాగుతున్నాయి.  


జిల్లా జనాభా: 9,27,140
ఉపాధి కార్యాలయంలో
నమోదైన యువత: 6,800 జిల్లా జనాభా: 9,27,140
ఉపాధి కార్యాలయంలో
నమోదైన యువత: 6,800

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని