Telangana News: రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్‌లన్నీ.. స్కామ్‌లుగా మారాయి: ఎంపీ లక్మణ్

ప్రతి గల్లీలో మద్యం దుకాణాలు పెట్టి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ విమర్శలు గుప్పించారు. తెరాస నేతలపై జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Updated : 03 Dec 2022 16:42 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా.. ప్రజా విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి హామీలను విస్మరించారన్నారు. ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని మండిపడ్డారు. పేదవాడు వంద గజాల భూమి కొనకుండా విపరీతంగా ధరలు పెంచారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. అది బయటపడుతుందనే భయంతోనే సీబీఐని రాష్ట్రంలోకి రావొద్దంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులన్నింటినీ తెరాస పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్‌లన్నీ.. స్కాములుగా మారాయన్నారు. 

తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఆద్యుడైన శ్రీకాంతాచారి  వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మ ఘోషిస్తోందన్నారు. ప్రతి గల్లీలో మద్యం దుకాణాలు పెట్టి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని విమర్శలు గుప్పించారు. తెరాస నేతలపై ఐటీ, ఈడీ దాడులకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీఎం కుమార్తె అయినా.. ఎవరైనా చట్టాలకు అతీతం కాదన్నారు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ప్రమేయం లేదన్నప్పుడు (కవితను ఉద్దేశించి) నిరూపించుకోవాలని సూచించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ తెరాసకు బీ టీమ్‌గా  మారిందని విమర్శించారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవడానికి భాజపా సిద్ధంగా ఉందని లక్ష్మణ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని