Kavitha: సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. కంప్లైంట్‌ కాపీ, ఎఫ్ఐఆర్‌ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరారు. డాక్యుమెంట్లు అందిన తర్వాత విచారణ తేదీ ఖరారు చేయవచ్చని లేఖలో పేర్కొన్నారు.

Updated : 03 Dec 2022 20:07 IST

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. దిల్లీ మద్యం కుంభకోణంపై కేంద్రహోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్‌ ప్రతులు ఇవ్వాలని సీబీఐని కోరారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని తెలిపారు. పత్రాలు అందిన తర్వాత హైదరాబాద్‌లో విచారణ తేదీ ఖరారు చేయవచ్చని లేఖలో పేర్కొన్నారు. దిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దిల్లీలో నమోదుచేసిన ఆర్‌సీ 53(ఎ)/2022 కేసులో దర్యాప్తు కోసం సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద దిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్‌ కుమార్‌ షాహి ఈ నోటీసులు జారీ చేశారు. ‘‘ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోకానీ, దిల్లీలో కానీ మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నాం. మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో దయచేసి తెలియజేయండి’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈమేరకు సీబీఐ పంపిన నోటీసుకు కవిత రిప్లై ఇచ్చారు. ఇవాళ ఉదయం నుంచి కవిత ప్రగతిభవన్‌లోనే ఉన్నారు. సీఎం కేసీఆర్‌, ముఖ్యనేతలు, కుటుంబ సభ్యులతో నోటీసులు, రాజకీయ పరిణామాలపై కవిత చర్చించినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని