logo

ప్రైవేటుకు దోమల నియంత్రణ?

గ్రేటర్‌లో దోమల నియంత్రణ ప్రైవేటు నిర్వహణకు వెళ్లనుందా? పారిశుద్ధ్యం మాదిరే దోమల విభాగాన్ని(ఎంటమాలజీ) జీహెచ్‌ఎంసీ క్రమంగా ప్రైవేటీకరించనుందా? అంటే.. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.

Published : 04 Dec 2022 01:56 IST

జీహెచ్‌ఎంసీ తీరుపై ఉద్యోగ సంఘాల ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో దోమల నియంత్రణ ప్రైవేటు నిర్వహణకు వెళ్లనుందా? పారిశుద్ధ్యం మాదిరే దోమల విభాగాన్ని(ఎంటమాలజీ) జీహెచ్‌ఎంసీ క్రమంగా ప్రైవేటీకరించనుందా? అంటే.. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రోడ్ల నిర్వహణ, పారిశుద్ధ్య విభాగాలను బల్దియా ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. ఇప్పుడు దోమల విభాగాన్నీ ప్రైవేటు బాట పట్టించేందుకు జీహెచ్‌ఎంసీ నగరంలోని ఓ ప్రైవేటు సంస్థతో చర్చలు ప్రారంభించడం విశేషం.

2 వేలకుపైగా సిబ్బంది..

పారిశుద్ధ్య నిర్వహణను 60శాతం మేర రాంకీ సంస్థ చేపడుతోంది. అందుకుగాను ఒక టన్ను చెత్తకు రూ.1,200 చొప్పున, నెలకు రూ.23.4 కోట్ల మేర జీహెచ్‌ఎంసీ రాంకీకి చెల్లిస్తోంది. స్వచ్ఛ ఆటోలు సేకరించిన వ్యర్థాలను, రోడ్ల పక్కన పోగయ్యే చెత్తను జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుకు తరలించి, నిర్వహణ చేస్తున్నందుకు ఆ మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. గడిచిన రెండేళ్లలో సుమారు 700 మంది బల్దియా కార్మికులు ఉపాధి కోల్పోయారని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగరవ్యాప్తంగా 810 కి.మీ ప్రధాన రహదారులను ఐదేళ్లపాటు ప్రైవేటు ఏజెన్సీలకు నిర్వహణకు ఇచ్చి, రూ.1,813 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది.  ఇప్పుడు దోమల నియంత్రణ విభాగం ప్రైవేటు బాట పడుతుందనే చర్చ బల్దియాలో మొదలైంది. పారిశుద్ధ్యం విధులు నిర్వర్తిస్తోన్న రాంకీకే ఎంటమాలజీని అప్పగించే సూచనలు కనిపిస్తున్నట్లు అధికారులు సైతం చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ ద్వారా 2వేల మంది కార్మికులు నిత్యం ఇంటింటికి తిరిగి దోమల మందు చల్లుతారని, చెరువులు, కుంటల్లో గుర్రపుడెక్క తొలగింపు, ఫాగింగ్‌ వంటి విధులు నిర్వర్తిస్తున్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ విభాగాన్ని ప్రైవేటుపరం చేస్తే కార్మికుల భవితవ్యం ఏంటనే ప్రశ్నకు జీహెచ్‌ఎంసీ సమాధానం చెప్పాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని