logo

దొంగల ముఠాకు బండ్లు ఇచ్చిన హైదరాబాదీ!

నగరంలో సంచలనం రేకెత్తించిన ఆభరణాల దుకాణం దోపిడీ కేసులో రాచకొండ పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి.

Published : 04 Dec 2022 09:07 IST

దిల్లీ, యూపీలో రాచకొండ పోలీసుల వేట

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో సంచలనం రేకెత్తించిన ఆభరణాల దుకాణం దోపిడీ కేసులో రాచకొండ పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఈ ఘటనలో నలుగురు అంతర్రాష్ట్ర దొంగలు పాల్గొన్నట్టు అంచనాకు వచ్చారు. ఈ నెల 1న రాత్రి నాగోలు పరిధి స్నేహపురికాలనీలోని నగల దుకాణంలోకి చొరబడిన నిందితులు.. అనంతరం కాల్పులు జరిపి 3.5 కిలోల బంగారంతో పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు బాధితులు కోలుకుంటున్నారు. దిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన నిందితులు పక్కా పథకం ప్రకారం దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇందుకోసం మూడ్రోజుల ముందుగానే నగరానికి చేరారు. సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో ఆభరణాలు తీసుకెళ్లేందుకు వచ్చే వారి కదలికలను గుర్తించారు. దీనికి అవసరమైన ద్విచక్రవాహనాలను నగరానికి చెందిన పాతనేరస్థుడు సమకూర్చినట్టు రాచకొండ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా.. దోపిడీ అనంతరం నలుగురు నిందితులు ద్విచక్రవాహనాలపై ఉప్పల్‌ వైపు వెళ్లినట్టు అంచనాకు వచ్చారు. నిందితులకు సహకరించిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అతడి నుంచి రాబట్టిన వివరాలతో దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

ఇది ఆ గ్యాంగ్‌ పని కాదు..

గతంలో కీసరలోనూ ఇదే తరహా దోపిడీ జరిగింది. నిందితులను గుజరాత్‌ రాష్ట్రంలోని అంక్లేశ్వర్‌లో రాచకొండ పోలీసులు అరెస్ట్‌  చేశారు. పాండే ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన అక్కడి పోలీసులపై పాండే బ్రదర్స్‌ కాల్పులు జరిపారు. పోలీసుల జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. ఆ కేసు నిందితుడు ప్రస్తుతం జైల్లో ఉన్నట్టు గుర్తించారు.  ఈ దోపిడీతో వీరికి సంబంధం లేదనే అంచనాకు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని