logo

పుట్టిన రోజు వేడుకలో గంజాయి

పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధి పసుమాములలో ఓ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు.

Published : 04 Dec 2022 02:02 IST

అదుపులో ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు

హయత్‌నగర్‌  న్యూస్‌టుడే: పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధి పసుమాములలో ఓ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు. పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి తాగుతూ.. డీజే సౌండ్‌తో హంగామా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న హయత్‌నగర్‌ పోలీసులు అక్కడికి చేరుకొని పార్టీని భగ్నం చేశారు. నగరంలోని రెండు ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. పసుమాముల సర్వే నం.247లో ‘ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌’ పేరుతో సున్నీ కిరణ్‌ ఫామ్‌హౌస్‌ నిర్వహిస్తున్నాడు. జితిన్‌ శుక్రవారం బర్త్‌డే పార్టీ ఇస్తుండడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. డీజే సౌండ్‌తో పాటు గంజాయి తాగుతున్నట్లు సమాచారం అందింది. హయత్‌నగర్‌ పోలీసులు అర్ధరాత్రి తర్వాత ఫౌమ్‌హౌస్‌పై దాడి చేశారు. మొత్తం 33 మంది ఉండగా నలుగురు యువతులు ఉన్నట్లు గుర్తించారు. ఫామ్‌హౌస్‌లోని కాటేజ్‌లో నలుగురు యువకులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించి ఏం చేస్తున్నారంటూ ఆరా తీస్తుండగానే వీరిలో ఒకరు పోలీసులను  గుర్తించి కాంపౌండ్‌వాల్‌ దూకి తప్పించుకున్నాడు. మిగిలిన ముగ్గుర్ని తనిఖీ చేయగా గంజాయి లభించింది.  సరూర్‌నగర్‌కు చెందిన కందూరు సాయిచరణ్‌రెడ్డి(19), దిల్‌సుఖ్‌నగర్‌ భవానీనగర్‌కు చెందిన గంగుల హిమచరణ్‌ రెడ్డి(20) బైరామల్‌గూడలోని ఎస్వీకాలనీకి చెందిన విశ్వచరణ్‌రెడ్డి(20)లను అదుపులోకి తీసుకున్నారు. 50 గ్రాముల గంజాయి, కారు, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఠాణాకు పిలిపించి ఎమ్మార్వో సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కొత్తపేటలో కొనుగోలు.. ముగ్గురు విద్యార్థులు కొత్తపేట మోహన్‌నగర్‌లో రూ.1200 చొప్పున 30గ్రాములు గంజాయి కొనుగోలు చేశారు. పరారీలో ఉన్న సనీత్‌చారి కొంత గంజాయిని బర్త్‌డే పార్టీకి తీసుకెళ్లాడు. కేక్‌ కటింగ్‌ తర్వాత ఫామ్‌హౌస్‌ గదిలోకి వెళ్లి తాగాలని నిర్ణయించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని