logo

తొలిమెట్టు.. పక్కాగా సాగేట్టు!

‘తొలిమెట్టు’ను జిల్లా వ్యాప్తంగా పక్కాగా అమలు చేసేందుకు విద్యాశాఖ ముమ్మర చర్యలు తీసుకుంటోంది.

Published : 04 Dec 2022 02:25 IST

పరిశీలనకు ‘టాస్క్‌ఫోర్స్‌’ ఏర్పాటు
న్యూస్‌టుడే, కొడంగల్‌ గ్రామీణం, వికారాబాద్‌

కొడంగల్‌లో సామర్థ్యాలు పరిశీలిస్తున్న ఎంఈవో రాంరెడ్డి

‘తొలిమెట్టు’ను జిల్లా వ్యాప్తంగా పక్కాగా అమలు చేసేందుకు విద్యాశాఖ ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రత్యేక పర్యవేక్షణకు ‘అకడమిక్‌ మానిటరింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ’ ఏర్పాటుకు ఆదేశించింది. ‘ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ’ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమం విజయవంతం చేయడమే లక్ష్యంగా కమిటీ పని చేస్తుందని అధికారులు వివరిస్తున్నారు. 

పాలనాధికారి పర్యవేక్షణ ...

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అకడమిక్‌ మానిటరింగ్‌ టాస్క్‌ఫోర్సు కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి ఛైర్మన్‌గా జిల్లా పాలనాధికారి వ్యవహరిస్తారు. సభ్యులుగా జిల్లా విద్యాశాఖ అధికారి, సెక్టోరియల్‌ అధికారి, జిల్లాస్థాయి రిసోర్స్‌ పర్సన్‌, ఎంఈవో, క్లస్ట్రర్‌ రిసోర్స్‌ పర్సన్‌, విద్యా రంగంలో పనిచేస్తున్న ఎన్‌జీవో ప్రతినిధి ఉంటారు.

ప్రాథమిక స్థాయిలోనే సామర్థ్యాల పెంపు

జిల్లాలోని 763 ప్రాథమిక, 116 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 55,981 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక స్థాయిలోనే సామర్థ్యాలు పెంచేందుకు ఆగస్టు నుంచి తొలిమెట్టు అమలవుతోంది. ప్రసుతం  జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్న టాస్క్‌ఫోర్సు కమిటీ పని చేయాల్సిన విధివిధానాలకు మార్గదర్శకాలు నిర్దేశించారు. తొలిమెట్టు ప్రణాళికకు అనుగుణంగా నెలవారిగా ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తారు. పాఠశాలల పనితీరు, విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తారు. ఉపాధ్యాయులు బోధనలో సామర్థ్యాలు పెంచుకునేందుకు టీఎల్‌ఎం తయారీ, విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధన పద్ధతులను పరిశీలిస్తారు. వందశాతం ఎఫ్‌ఎల్‌ఎన్‌ లక్ష్యాలను సాధించేలా ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తారు. ఎమ్మార్సీ, సీఆర్సీల మధ్య సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు అందిస్తారు.  

ప్రత్యేకంగా నివేదికలు

ఈ కమిటీ సభ్యులు పాఠశాలలను సందర్శించి తొలిమెట్టు కార్యక్రమాల అమలు, ఉపాధ్యాయుల బోధనతీరు, విద్యార్థులు నేర్చుకుంటున్న విధానంపై పరిశీలన చేస్తారు. తొలిమెట్టు అమలుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టాస్క్‌పోర్సును ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి రవికుమార్‌ తెలిపారు.

బోధన పేరుతో ఒత్తిడి సరికాదు
- చంద్రశేఖర్‌, పీఆర్టీయూ, జిల్లా అధ్యక్షులు

టాస్క్‌ఫోర్సు విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలి. బోధన పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచవద్దని అభిప్రాయపడుతున్నాం. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను పట్టించుకోకుండా ఇలా చేయడం న్యాయం కాదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని