logo

Hyderabad Airport Metro: భూగర్భం బదులు ఆకాశమార్గం

శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్‌ మెట్రోని ఓఆర్‌ఆర్‌ సర్వీసు రహదారి వెంట భూమార్గంలో(ఎట్‌ గ్రేడ్‌) చేపట్టాలని మొదట భావించినా.. క్రాసింగ్‌లు ఎక్కువ ఉండటంతో ఎలివేటెడ్‌(ఆకాశ మార్గం) వైపు మొగ్గు చూపారు.

Updated : 04 Dec 2022 12:31 IST

విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో డీపీఆర్‌ సమయంలోనే మార్పులు

ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్‌ మెట్రోని ఓఆర్‌ఆర్‌ సర్వీసు రహదారి వెంట భూమార్గంలో(ఎట్‌ గ్రేడ్‌) చేపట్టాలని మొదట భావించినా.. క్రాసింగ్‌లు ఎక్కువ ఉండటంతో ఎలివేటెడ్‌(ఆకాశ మార్గం) వైపు మొగ్గు చూపారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ. మెట్రో మార్గానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌) రూపకల్పన సమయంలో రెండింటి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. నానక్‌రాంగూడ కూడలి నుంచి శంషాబాద్‌ వరకు 16 క్రాసింగ్‌లున్నాయి. భూ మార్గం కన్నా ఆకాశ మార్గానికి తక్కువ వ్యయం అవుతుండటంతో దీనివైపే మొగ్గు చూపినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి.

ఓఆర్‌ఆర్‌ లోపల నుంచే..

బయోడైవర్సిటీ కూడలి నుంచి కాజాగూడకు వెళ్లాలంటే ఎడమ వైపు కొంతదూరం ప్రయాణించి ఆ తర్వాత కుడివైపు తిరగాల్సి ఉంటుంది. మెట్రో అలైన్‌మెంట్‌ మాత్రం బయోడైవర్సిటీ కూడలి నుంచి నేరుగా కాజాగూడ చెరువు పక్కనుంచి ఉన్న రహదారి వెంట వెళుతుంది. కాజాగూడ ప్రధాన రహదారి మీదుగా నానక్‌రాంగూడ కూడలిలో ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులోకి చేరుతుంది. పూర్తిగా ఓఆర్‌ఆర్‌ లోపలి నుంచి అలైన్‌మెంట్‌ వెళుతుంది. శంషాబాద్‌ వద్ద లీఫ్‌ ఇంటర్‌ఛేంజ్‌ దాటి విమానాశ్రయంలోకి ప్రవేశిస్తుంది. ఈ మార్గంలో ఎనిమిది స్టేషన్ల దాకా ప్రతిపాదించారు. వీటిలో అలైన్‌మెంట్‌ను బట్టి స్వల్ప మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. గంటకు 100-120 కి.మీ. వేగంతో ఇది దూసుకెళ్లనుంది. 20 నిమిషాల్లోనే విమానాశ్రయంలో ఉండాలనేది ప్రణాళిక. మూడేళ్ల కిందట ప్రాథమిక అంచనా వ్యయం రూ.4650 కోట్లు ఉండగా.. శంకుస్థాపన నాటికి రూ.6250 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌కు మైండ్‌స్పేస్‌ వద్ద సీఎం కేసీఆర్‌ ఈనెల 9న పునాది రాయి వేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని