logo

తెలంగాణలో అమరుల కుటుంబాలకు అన్యాయం

ఉద్యమకారుడు కదా అని కేసీఆర్‌కు రెండుసార్లు అధికారమిస్తే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

Updated : 04 Dec 2022 05:39 IST

వైతెపా అధ్యక్షురాలు షర్మిల

శ్రీకాంతాచారి చిత్రపటాన్ని చేతపట్టుకొని నినదిస్తున్న వైఎస్‌ షర్మిల, పార్టీ నేతలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఉద్యమకారుడు కదా అని కేసీఆర్‌కు రెండుసార్లు అధికారమిస్తే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఆరోపించారు. మలిదశ ఉద్యమంలో అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా శనివారం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన శ్రీకాంతాచారి చిట్రపటానికి ఆమె నివాళులర్పించి మాట్లాడారు.  తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్‌ ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. 1200 మంది బలిదానం చేస్తే అందులో  500 మందికి మాత్రమే సాయం అందించారని ఆరోపించారు. ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకొని మంత్రి పదవులిచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కేసీఆర్‌.. శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతుందని తెలిసి కూడా పోటీలో నిలబెట్టారని, ఓడిన తరువాత ఆమెకు ఎందుకు నామినేటెడ్‌ పదవి ఇవ్వలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత అమరుల కుటుంబాలకు ఇళ్లు, ఉద్యోగాలిస్తామని ప్రకటించారు. ఉద్యమకారులను సమరయోధులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ప్రశ్నించగా..ఆయనో థర్డ్‌ క్లాస్‌, విశ్వసనీయత లేని వ్యక్తి అని, ఆయన మాటలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

స్తూపాన్ని శుద్ధి చేసిన తెరాస నేతలు

వైతెపా అధినేత్రి షర్మిల  అమరవీరుల స్తూపాన్ని తాకడంపై తెరాస శ్రేణులు భగ్గుమన్నాయి. స్తూపం మలినమైందంటూ తెరాసవి, ఓయూ విభాగం ఆధ్వర్యంలో శుద్ధి చేసి, క్షీరాభిషేకం చేశారు. అనంతరం శ్రీకాంతాచారి  చిత్రపటానికి నివాళులర్పించారు. తెరాసవి రాష్ట్ర కార్యదర్శి దశరథ్‌, ఓయూ తెరాస విద్యార్థి నేత చందు మాట్లాడుతూ.తెలంగాణ రాకుండా వైఎస్‌ఆర్‌ అడ్డుకున్నారని, ఇప్పుడు కుమార్తె తెలంగాణపై మళ్లీ కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆమె నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని