logo

బాధలకు చలించి.. బాధ్యతతో ఆలోచించి..

పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు దివ్యాంగులు, అంధులు, వృద్ధుల బాధలు చూసి చలించారు. వారికి ఆసరాగా నిలిచే పరికరాలను ఆవిష్కరించాలని లోతుగా ఆలోచించారు.. చివరికి సాధించారు.

Published : 04 Dec 2022 03:23 IST

దివ్యాంగులకు సహాయకారిగా నిలిచే ఆవిష్కరణలు
వేదికైన టీఎస్‌ఐసీ

రాయదుర్గం, న్యూస్‌టుడే: పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు దివ్యాంగులు, అంధులు, వృద్ధుల బాధలు చూసి చలించారు. వారికి ఆసరాగా నిలిచే పరికరాలను ఆవిష్కరించాలని లోతుగా ఆలోచించారు.. చివరికి సాధించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయదుర్గం టీహబ్‌లో టీఎస్‌ఐసీ (తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌).. వృద్ధుల సంక్షేమ శాఖ, మహిళా, బాలల అభివృద్ధి శాఖ, విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీలతో కలిసి శనివారం తెలంగాణ సహాయక సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహించింది. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ హాజరై ఆవిష్కర్తలకు బహుమతులు అందించారు. ఇందులో విద్యార్థులు, యువత శోధించి రూపొందించిన 39 ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఉత్తమ పల్లె సృజన అవార్డు కింద శివకుమార్‌ మోధా ఆవిష్కరించిన చేనేత యంత్రానికి అవార్డు దక్కింది. ఉత్తమ ఆవిష్కరణ సంస్థగా స్టార్టూన్‌ ల్యాబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిలిచింది. ఉత్తమ విద్యార్థుల ఆవిష్కరణగా స్మార్ట్‌ బ్యాండేజ్‌ నిలిచాయి. దివ్యాంగులు వృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్‌ డైరెక్టర్‌ డి.శైలజ, టీవీసీసీ ఛైర్మెన్‌ వాసుదేవరెడ్డి, టీఎస్‌ఐసీ సీఐవో డాక్టర్‌ శాంతా తౌతం పాల్గొన్నారు.


వృద్ధులకు ఊతకర్ర, ప్రత్యేక మరుగుదొడ్డి

 

రాజన్న సిరిసిల్ల జిల్లా, దమ్మన్నపేట జెడ్‌పీహెచ్‌ఎస్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థినులు మెర్సి రాణి, నందు కలిసి వృద్ధులకు ఉపయోగపడే ఊతకర్ర కం ప్రత్యేక మరుగుదొడ్డి(వెస్టర్న్‌ టాయిలెట్‌)ను ఆవిష్కరించారు. నందు నాన్నమ్మ కింద పడిన ఘటనకు చలించి తోటి విద్యార్థిని మెర్సీతో కలిసి ఊత కర్ర, దానికి కుర్చీని అమర్చారు. బహిర్భూమికి వెళ్లేందుకు ఇది తోడ్పడుతుంది. పట్టుతప్పి కింద పడితే అలారం మోగేలా చేశారు.


స్మార్ట్‌ బ్యాండేజ్‌

 

జనగామ జిల్లా, దేవరుప్పల.. బాలయేసు హైస్కూల్‌ విద్యార్థినులు ఆరాధ్య లక్కీ, స్నేహిత స్మార్ట్‌ బ్యాండేజ్‌ను ఆవిష్కరించారు. ప్రమాదాలు జరిగినపుడు, మధుమేహగ్రస్థులు గాయపడితే గాయాలకు రోజూ డ్రెసింగ్‌ చేయాల్సి ఉంటుంది. పైపులు, మోటర్లు ఉపయోగించి గాయాలకు వేడి గాలి, చల్లగాలి తగిలే ఏర్పాటు చేశారు. తగిలిన గాలి వెలుపలికి వెళ్లేలా పైపులూ ఉంటాయి. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ పైపుల ద్వారా చేరి గాయాన్ని శుభ్రపర్చి మలినాలను మరో పైపు నుంచి బయటికి పంపేలా చేశారు.


కళ్లతో నడిపే కంప్యూటర్‌ మౌస్‌

 

మెదక్‌ నర్సాపూర్‌ బీవీఆర్‌ఐటీలో బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ విద్యార్థి సేవంత్‌ గాజుల.. కళ్లతో నియంత్రించే కంప్యూటర్‌ మౌస్‌ను రూపొందించాడు. ఇందుకు ప్రత్యేక యాప్‌ను ’రూపొందించాడు. యాప్‌ను నిక్షిప్తం చేసుకునే ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌లలో కెమెరా తప్పనిసరి (కెమెరా లేని కంప్యూటర్‌కు వెబ్‌ కెమెరా అమర్చుకోవాల్సి ఉంటుంది). కంప్యూటర్‌ ముందు కూర్చునే వ్యక్తి కళ్లను కెమెరా తొలుత స్కాన్‌ చేసుకుంటుంది. ఆ తెరను చూస్తూ శరీరాన్ని ఎటు కదిలిస్తే అటు తెరపై కర్సర్‌ కదులుతుంది. తెరపై అవసరమైన ఐకాన్‌, విండోలపైకి కర్సర్‌ను తీసుకెళ్లి కళ్లు అర్పితే క్లిక్‌ అయి ఐకాన్‌ ఓపెన్‌, క్లోజ్‌ అవుతుంది.


బ్రెయిలీ లిపి లర్నర్‌.. క్వర్టీ కీ బోర్డు

 

బీవీఆర్‌ఐటీకే చెందిన సూర్యతేజ, జాయ్‌ అంధులకు బ్రెయిలీ లిపీ క్వర్టీ కీ బోర్డును ఆవిష్కరించారు. దానికి వాయిస్‌తో కూడిన కీ బోర్డు వారికి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. ఏ అక్షరం మీట నొక్కితే ఆ అక్షరం శబ్దం స్పీకర్‌లో వినిపిస్తుంది. అంతేకాక దానికి అనుసంధానించే ఉండే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే చరవాణిలో కూడా అక్షరాలు నొక్కినప్పుడు శబ్దం వినిపిస్తుంది. ఒక్కో విద్యార్థికి వ్యక్తిగతంగా కాక యాప్‌ ద్వారా చరవాణి, కంప్యూటర్‌ సహకారంతో అనేక మంది విద్యార్థులకు ఒకేసారి అక్షరాభ్యాసం చేయించే వీలు ఉంటుంది.


టచ్‌మీ నాట్‌ జాకెట్‌

 

బీఆర్‌ ఐటీకే చెందిన పుప్రియ, రక్షిత, ఖ్యాతి అనే విద్యార్థినులు సెన్సార్‌లు ఉపయోగించి టచ్‌ మీ నాట్‌ పేరుతో జాకెట్‌ను రూపొందించారు. బుద్ధిమాంద్యం, దివ్యాంగులైన యువతులను దృష్టిలో ఆ జాకెట్‌ను తెచ్చారు. జాకెట్‌ ధరించిన వారి శరీర భాగాలను ఎవరైనా తాకితే వెంటనే జాకెట్లో ఉండే అలారం మోగుతుంది. సమీపంలో ఉండే ప్రజలు చేరుకుని వారిని రక్షించే వీలుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని