logo

ప్రమాదాల నివారణకు.. ప్రయోగాత్మక విధానం

రైలు ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన ట్రైన్‌ కొలిషన్‌ అడ్వాన్స్‌ సిస్టమ్‌(టీకాస్‌) పనితీరును దక్షిణ మధ్య రైల్వేలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.

Published : 05 Dec 2022 04:27 IST

టీకాస్‌ పనితీరు చిత్రం

న్యూస్‌టుడే, కాచిగూడ: రైలు ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన ట్రైన్‌ కొలిషన్‌ అడ్వాన్స్‌ సిస్టమ్‌(టీకాస్‌) పనితీరును దక్షిణ మధ్య రైల్వేలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఈ విధానాన్ని ప్రమాదాలను నివారించే కవచంగా(కవచ్‌గా) పేర్కొంటున్నారు. కాచిగూడ స్టేషన్లో 2019 నవంబరు 16న ఎంఎంటీఎస్‌ రైలు ఎదురుగా వస్తున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలకు శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో

కాచిగూడ స్టేషన్లో జరిగిన దుర్ఘటనలో ఎంఎంటీఎస్‌ రైలు లోకో పైలెట్‌ సహా పలువురు ప్రాణాలు కోల్పోగా, దక్షిణ మధ్య రైల్వేకు కోట్లాది రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడానికి రైల్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌(ఆర్‌డీఎస్‌ఓ) వారు మేధా సర్వో డ్రైవ్స్‌, హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌, కెర్నెక్స్‌ మైక్రోసిస్టమ్స్‌ సహకారంతో టీకాస్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దీనిని సికింద్రాబాద్‌-వికారాబాద్‌, నిజామాబాద్‌-ముత్కేడ్‌ సెక్షన్లలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇది విజయవంతమైతే మిగిలిన వాటిలో విస్తరించాలని భావిస్తున్నారు.

రైల్వే మంత్రి పరిశీలన

* నగరంలోని సనత్‌నగర్‌-లింగంపల్లి స్టేషన్ల మధ్య టీకాస్‌ పని తీరును రైల్వే బోర్డు ప్రిన్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(భద్రత) కొన్ని రోజుల క్రితం పరిశీలించారు.

* ఈ ఏడాది మార్చిలో నగరానికి వచ్చిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ సనత్‌నగర్‌-వికారాబాద్‌ మధ్య చిట్టిగడ్డ స్టేషన్‌ వద్ద దీని పనితీరును పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని